తనిఖీల్లో భాగంగా డిప్యూటీ తహశీల్దార్ ఇంట్లో బయటపడిన ఆస్తుల చిట్టా చూసి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఖంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పాణ్యం మండల డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తోన్న పత్తి శ్రీనివాసులు ఇంటిపై ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు.

కోవెలకుంట్ల, నంద్యాల్లోని నివాసాలతో పాటు పాణ్యం మండలం కొండజూటురులోని శ్రీనివాస్ మామగారి ఇంటిపైనా ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

నంద్యాలలోని రూ.1.60 లక్షల నగదు, 250 గ్రాముల బంగారు ఆభరణాలు.. కోవెలకుంట్లలో 2014లో రూ.70 లక్షలతో కొనుగోలు చేసిన 485 చదరపు గజాల్లోని జీ+3 భవనం, 103.88, 503, 143 చదరపు గజాల్లో నిర్మించిన మరో మూడు ఇళ్లు, రూ.11.60 లక్షల విలువ చేసే 4.64 ఎకరాల వ్యవసాయ భూములు, రూ.20 లక్షలు విలువచేసే ఇన్నోవా వాహనం, ట్రాక్టర్, రెండు బైకులు, రూ.25 లక్షల విలువగల ఎల్‌ఐసీ బాండ్లతో పాటు కోవెలకుంట్ల ఆంధ్రప్రగతి బ్యాంకు లాకరులో రూ.1.50 లక్షల నగదును అధికారులు గుర్తించారు.

పత్రాల ప్రకారం ఈ మొత్తం ఆస్తి విలువ 1.5 కోట్లు కాగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.5 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. కాగా.. పత్తి శ్రీనివాసులు తన తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మరణించడంతో కారుణ్య నియామకం కింద.. 2004లో జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు.

ఆ సమయంలో ఆయన నెల జీతం రూ.1,800 మాత్రమే. ఆ తర్వాత కర్నూలు జిల్లాలోని పలు ఎమ్మార్వో కార్యాలయాల్లో జూనియర్, సీనియర్ అసిస్టెంట్‌, ఆర్ఐగా పనిచేశారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి కోట్లను సంపాదించినట్లుగా అధికారులు గుర్తించారు.

మరోవైపు శ్రీనివాసులు భార్య హరిత ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తూ డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగం సాధించారు. శ్రీనివాస్ పనిచేస్తున్న కార్యాలయంలోనే ఆమె కూడా ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.