ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిరాధారంగా ఆయనను అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఏ కాగా.. ఆధారాలున్నాయి కాబట్టే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశామంటూ ఏసీబీ జేడీ రవికుమార్ తెలిపారు.

శనివారం ఈఎస్‌ఐ స్కాంపై ఏసీబీ జేడీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధారాలు ఉన్నాయి కాబట్టే అచ్చెన్నాయుడ్ని విచారణకు రావాలని కోరలేదని చెప్పారు. ఈఎస్‌ఐ స్కాంకు సంబంధించి ఇప్పటి వరకు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. 

ఈ కేసులో ఇప్పటి వరకు డైరెక్టర్లు విజయ్ కుమార్, రమేష్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జేడీ జనార్ధన్, ఉద్యోగులు చక్రవర్తి, వెంకట్రావు, రమేష్ బాబు అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

ఈఎస్ఐ నిధుల కేటాయింపులో 2018-19కి సంబంధించి రూ.988 కోట్లలో రూ.150 కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించామని రవికుమార్ వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 19 మంది ముద్దాయిలను గుర్తించామని...మరింత మందిని విచారణ చేయబోతున్నట్లు తెలిపారు. 

డాక్యుమెంట్స్ పరిశీలన చేయాల్సి ఉందన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన అచ్చెన్నాయుడికి వైద్యం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని....డాక్టర్ల బృందం ఆయనకు వైద్యం చేసిందని చెప్పారు. అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్ తరపున హౌస్ మోషన్ పిటిషన్లు వేశారన్నారు. వేరే రాజకీయ నాయకుల పాత్ర ఇంత వరకు గుర్తించలేదని ఏసీబీ జేడీ పేర్కొన్నారు. 

ఈ స్కాంలో ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామన్నారు. అవసరం లేకపోయినా, నాణ్యత లేని పరికరాలు, మందులు కొన్నారని తెలిపారు. అచ్చెన్నాయుడు లెటర్ ల్యాడ్ ద్వారా  ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. కొనుగోళ్లు, టెలీ మెడిసిన్‌కి సంబంధించి విడి విడిగా రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసామని... ఈ రెండు కేసుల్లో ఏ1గా రమేష్ కుమార్, ఏ2గా అచ్చెన్నాయుడు ఉన్నారని ఏసీబీ జేడీ రవికుమార్ తెలిపారు.