హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొందిన స్టే ఆర్డర్స్ వివరాలను ఏసీబీ కోర్టు అడిగింది. చంద్రబాబు ఆస్తులపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి 2005లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుపై ఎసీబీ కోర్టు చంద్రబాబు స్టే ఆర్డర్స్ వివరాలు కోరింది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు అక్రమంగా డబ్బులు కూడబెట్టుకున్నారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక చట్టం కింద దాఖలైన కేసుల వివరాలు చెప్పాలని లక్ష్మీపార్వతి దరఖాస్తు చేసుకున్నారు. 

ఆ కేసులో చంద్రబాబు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. కేసులపై స్టే ఆర్డర్లను ఆరు నెలలకు పరిమితం చేస్తూ సుదీర్ఘ కాలంగా స్టే ఆర్డర్లను ఎత్తేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో చంద్రబాబుకు ఇచ్చిన స్టే ఆర్డర్ ను వెకేట్ చేసింది. 

ఆ కేసును హైదరాబాదు ఎసీబీ కోర్టు తిరిగి తెరిచింది. తన పిటిషన్ పై కోర్టు ముందు హాజరు కావాలని లక్ష్మీపార్వతికి సమన్లు జారీ అయ్యాయి. హైకోర్టు వెబ్ సైట్లో ఇంకా స్టే ఆర్డర్ ఉన్నట్లు కేసు వివరాలు ఉన్నాయి. అయితే, దానికి సంబంధించిన ఫిజికల్ రికార్దులు కావాలని ఏసీబీ కోర్టు కోరింది. కేసు విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.