ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : చంద్రబాబుకు మరో షాక్.. హౌస్ కస్టడీ పిటిషన్ కొట్టివేసిన కోర్ట్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్ట్ కొట్టివేసింది.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్ట్ కొట్టివేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఎలాంటి ముప్పు లేదన్న సీఐడీ వాదనలతో ఏసీబీ కోర్ట్ ఏకీభవించింది. భద్రతపై చంద్రబాబు తరపు లాయర్లు చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోనికి తీసుకోలేదు.
అంతకుముందు సోమవారం చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు హౌస్ కస్టడీకి అనుమతించాలని ఆయన తరఫును సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు హోదా, వయసు రీత్యా హౌస్ రిమాండ్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తీర్పులను ప్రస్తావించారు. చంద్రబాబు హౌస్ కస్టడీకి అనుమతించాలిన న్యాయమూర్తిని కోరారు. మరోవైపు సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, స్పెషల్ జీపీ వివేకానంద వాదనలు వినిపించారు.
చంద్రబాబుకు ఇంట్లో కంటో జైలులో భద్రత ఉంటుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. జైలులో చంద్రబాబుకు పూర్తి స్థాయి భద్రతను కల్పించినట్టుగా చెప్పారు. జైలు లోపల, బయట పోలీసుల భద్రత ఉందని తెలిపారు. అవసరమైతే వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును చంద్రబాబు కేసుకు ముడిపెట్టవద్దని అన్నారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ డిస్మిస్ చేయాలని కోరారు.
అయితే ఈ పరిస్థితుల వేళ జైళ్ల శాఖ డీజీ హరీష్ కుమార్ గుప్తా అడ్వొకేట్ జనరల్‌కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. సోమవారం(సెప్టెంబర్ 11)న ఆయన ఈ లేఖ రాశారు. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని జైళ్ల శాఖ డీజీ అందులో పేర్కొన్నారు. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో అన్ని రకాల వసతులతో కూడిన స్పెషల్ వార్డు కేటాయించామని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ బ్లాక్ శానిటైజ్ చేశామని తెలిపారు. చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్‌కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించామని చెప్పారు.
చంద్రబాబు ఉన్న బ్లాక్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. బ్లాక్ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు. స్పెషల్ వార్డు ముందు ప్రత్యేక వైద్య బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించినట్టే అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. కేవలం చంద్రబాబు అనుమతిస్తేనే ఎవరికైనా ఎంట్రీక కల్పిస్తున్నామని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అక్కడి భద్రతను 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఇక, జైళ్ల శాఖ డీజీ నుంచి వచ్చిన ఈ లేఖను.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమర్పించినట్టుగా సమాచారం.