సారాంశం

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్, తదుపరి విచారణ కోసం సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లపై విచారణ మరోసారి వాయిదా పడింది.

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్, తదుపరి విచారణ కోసం సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లపై విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై ఈరోజు విచారణ చేపట్టనున్నట్టుగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సోమవారం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఈరోజు సెలవులో ఉన్నారు. దీంతో ఏసీబీ కోర్టు ఇంచార్జీగా మెట్రో పాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి సత్యానందం వ్యవహరించారు. 

ఈ క్రమంలోనే సీబీ కోర్టు ఇంచార్జీ ఉన్న న్యాయమూర్తిని.. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌లను ఇరువర్గాల న్యాయవాదులు కోరారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌‌పై వాదనలు వినాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాదులు.. ఇంచార్జ్ న్యాయమూర్తిని ‌కోరారు. అయితే ఈరోజే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం  కష్టమని న్యాయమూర్తి పేర్కొన్నారు. రేపటి  నుంచి తాను సెలవుపై వెళ్లనున్నట్టుగా కూడా చెప్పారు. రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని సూచించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా పడింది. 

ఇక, ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు ఇప్పటికే పిటిషన్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సెప్టెంబరు 23, 24 తేదీల్లో రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడును కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు జరిపిన విచారణ నివేదికను సీఐడీ అధికారులు సోమవారం సీల్డ్ కవర్‌లో ఏసీబీ న్యాయమూర్తికి సమర్పించారు.  అంతేకాకుండా చంద్రబాబు నాయుడును తదుపరి ప్రశ్నించడానికి మరో ఐదు రోజుల కస్టడీని కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.