తనకు ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదని.. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ ఏపీ సీఎస్ సమీర్ శర్మకు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. 

ఏపీ సీఎస్ సమీర్ శర్మకు (sameer sharma) గురువారం సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (ab venkateswara rao) లేఖ రాశారు. తన సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పును (ap high court) అమలు చేయడం లేదంటూ ఏబీవీ పేర్కొన్నారు. తనను సస్పెండ్ చేస్తూ గతంలో జీవో జారీ చేసిన కాలం నుంచే తన సస్పెన్షన్ రివోక్ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. హైకోర్టు ఉత్తర్వులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని.. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మాత్రమే నా సస్పెన్షన్ రివోక్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందిని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన సస్పెన్షన్‌ను రివోక్ చేస్తూ ఇచ్చిన జీవోను సవరించాలంటూ వివిధ సందర్భాల్లో తాను చేసిన విజ్ఞప్తులను ఇప్పటికీ పట్టించుకోలేదని ఏబీవీ వెల్లడించారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదని.. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 

ఇకపోతే.. కోర్టు తీర్పు మేరకు ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీసు పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని సూచించింది. దీనిలో భాగంగా మే 19న ఏబీ వెంకటేశ్వరరావు జీఏడీలో రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎస్‌కు రిపోర్ట్ చేసేందుకు జీఏడీకి వెళ్లానని చెప్పారు. 

Also Read:అందుకే సీఎస్‌ను కలవాలని అనుకున్నాను.. నన్ను కలవడం ఆయనకు ఇష్టం లేదేమో?: ఏబీ వెంకటేశ్వరరావు

ఆయన పీఏకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వచ్చినట్టుగా చెప్పారు. జీఏడీలో జూనియర్‌ అధికారులుంటారని, సివిల్‌ సర్వీసెస్‌ సంప్రదాయాల ప్రకారం సీనియర్ అధికారులు.. జూనియర్లకు రిపోర్ట్‌ చేయకూడదన్నారు. సీనియర్‌ అధికారి లేకపోతే వారి పీఏకు ఇవ్వాలనడం సంప్రదాయమని తెలిపారు. ఆఫీస్‌లో సీఎస్‌ ఉండి కూడా రిపోర్ట్‌ పేషీలో ఇచ్చేసి వెళ్లిపోమన్నారని చెప్పారు. బిజీగా ఉంటే రేపు సమయమిచ్చి రమ్మని ఉంటే బాగుండేదన్నారు. తనను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదమో అన్నారు. జీఏడీలో రిపోర్ట్ చేయడం వరకే తన పని అని.. అది చేశానని చెప్పారు. 

తన వినతి పత్రం చదివితే కదా అందులో ఏముందో తెలిసేది అని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు సరిచేయాలని కోరేందుకు సీఎస్‌ను కలవాలని అనుకున్నట్టుగా చెప్పారు. రెండేళ్ల సస్పెన్షను సర్వీస్‌గా పరిగణించాలని సీఎస్‌ను అడుగుదామని అనుకున్నానని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి వెయింటింగ్ పీరియడ్ అంటున్నారని.. కానీ రెండేళ్ల సస్పెన్షన్ గురించి మాట్లాడటం లేదన్నారు. ఆర్డర్ సరిచేయకుంటే తాను మళ్లీ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందన్నారు.