అమరావతి: ఇటీవల ఎన్నికల సమయంలో ఎబీ వెంకటేశ్వర రావు పేరు అందరికీ పరిచయమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆయనకు గడ్డు కాలం మొదలైంది. ఎన్నికల సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం చీఫ్ గా ఆయన వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీకి అనుకులంగా వ్యవహరిస్తున్నారంటూ ఎబీ వెంకటేశ్వర రావుపై అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనను ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఆ తర్వాత ఆయనను చంద్రబాబు ప్రభుత్వమే ఎసీబీ చీఫ్ గా నియమించింది. 

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఎక్కడా పోస్టింగ్ దక్కలేదు. దీంతో ఆయన లాంగ్ లీవ్ పై వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 1వ తేదీననే ఆయన సెలవుపై వెళ్లారు. ఈ నెల 28వ తేదీ వరకు ఆయన సెలవులో ఉంటారు. 

అయితే, తిరిగి వచ్చిన తర్వాతనైనా తనకు పోస్టింగ్ దక్కుతుందనే నమ్మకం ఎబీ వెంకటేశ్వర రావుకు లేదని చెబుతున్నారు. దీంతో తనను కేంద్ర సర్వీసులకు పంపించాలని ఆయన దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ దరఖాస్తు ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది.