ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళలేరు. అలాగని, వైసీపీలోకి వెళ్ళటానికి మొహం చెల్లటం లేదు. కాబట్టి కొంతకాలం రాజకీయ అజ్ఞాతవాసం తప్పదు. ఏం చేస్తాం తప్పటడుగులు వేస్తే ఇలాగే ఉంటుంది.

ఆనం బ్రదర్స్ ను చూస్తే పాపం అనిపిస్తుంది. తొందరపడి టిడిపిలో చేరినందుకు ఇపుడు తీరిగ్గా బాధపడుతున్నారట. వైఎస్ హయాంలో సోదరులిద్దరూ ఒక వెలుగు వెలిగారు. తర్వాత ఐదేళ్ళూ వారి హవా బాగానే సాగింది. రాష్ట్ర విభజన తర్వాత కొద్ది రోజులు రాజకీయంగా అజ్ఞాతంలో గడిపి ఇటీవలే టిడిపిలో చేరారు. కొత్తలో బాగానే ఉన్నా పోనుపోను ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. పార్టీలోకి చేరేటపుడు తమకు ఇచ్చిన హామీల విషయాన్ని చంద్రబాబునాయుడుకు గుర్తుచేసి భంగపడ్డారు.

అయితే, సోదరుల్లో రామనారాయణ రెడ్డి మొదటి నుండి మౌనంగానే ఉంటారు. వివేకానందరెడ్డే ఎగిరెగిరి పడుతుంటారు. బహుశా సోదరుల్లో ఆ మేరకు ఒప్పందముందేమో. సహజ ధోరణిలోనే వివేకా, జగన్ పై తన ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఇక, రోజాపైనా చిత్ర, విచిత్రమైన హావభావాలతో విరుచుకుపడ్డారు. పిచ్చి వేషాలతో జనాలకు వినోదాన్నీ పంచారులేండి. ఎంఎల్సీ ఎన్నికల్లో స్ధానిక సంస్ధల కోటాలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబును అడిగి అవమానపడ్దారు. దాంతో సోదరులకు కళ్ళు తెరుచుకున్నాయి.

గడచిన వారం రోజులుగా వివేకా మీడియాకు దొరకటం లేదు. సోదరిలిద్దరూ దాదాపు ఎవరితోనూ టచ్ లో లేరు. టిడిపిలోకి వెళ్ళాలన్న రాంగ్ స్టెప్ సోదరులను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. కాంగ్రెస్ హయాంలో బాగా వెలిగిన సోదరులు టిడిపిలోకి వెళ్ళాలనుకోవటమే పెద్ద తప్పు. ఎందుకంటే, నెల్లూరు జిల్లా నుండి మంత్రిగా నారాయణ ఉన్నపుడు తమ ఆటలు ఎలా సాగుతాయనుకున్నారో? పార్టీ ఆవిర్భావం నుండి టిడిపిలోనే ఉన్న సోమిరెడ్డి లాంటి వాళ్ళకే దిక్కులేదు. ఇక వీరిలెక్కేమిటి? పైగా ఆనం సోదరులకు ఏమాత్రం సందిచ్చినా చొచ్చుకుపోతారన్న విషయం నారాయణకు తెలీదా?

విభజన తర్వాత కాంగ్రెస్ లో ఉండలేక, వైసీపీలోకి వెళ్ళలేక టిడిపిలోకి వస్తామన్నారు కాబట్టి చంద్రబాబు కూడా సరే అన్నారు. పార్టీలోకి చేరేముందు అవసరార్ధం అనేక హామీలిస్తారు. అవన్నీ తీరుస్తారా ఏంటి? జగన్, రోజా లాంటి వాళ్ళను తిట్టడానికి టిడిపిలోకి ఎంతమంది వస్తామన్నా చంద్రబాబు వద్దనరు కదా? తాజా పరిస్ధితి ఏమిటంటే, టిడిపిలో భంగపడిన సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళలేరు. అలాగని, వైసీపీలోకి వెళ్ళటానికి మొహం చెల్లటం లేదు. కాబట్టి కొంతకాలం రాజకీయ అజ్ఞాతవాసం తప్పదు. ఏం చేస్తాం తప్పటడుగులు వేస్తే ఇలాగే ఉంటుంది.