చంద్రబాబుకు ఎలాంటి ప్రాణహాని లేదు.. జైల్లో ఎన్ఎస్‌జీని మించిన భద్రత : పొన్నవోలు సుధాకర్ రెడ్డి
చంద్రబాబుకు ప్రాణహాని వుందన్న మాట అవాస్తవమన్నారు ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు ఆరోగ్య పర్యవేక్షణకు 24 గంటలూ డాక్టర్లు అందుబాటులో వుంటారని ఏఏజీ చెప్పారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ.371 కోట్ల రాష్ట్ర ఖజానా సొమ్ము దోపిడీకి గురైందన్నారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షెల్ కంపెనీలపై జీఎస్టీకి ఆధారాలు దొరికాయన్నారు. గత ప్రభుత్వ పెద్దలే ఈ కుంభకోణానికి పాల్పడ్డారని పొన్నవోలు ఆరోపించారు. ప్రజల సొమ్ము దొంగ కంపెనీల ద్వారా ఓ వర్గం చేతిలోకి వెళ్లిందని ఆయన పేర్కొన్నారు.
ఎలాంటి చర్చ లేకుండా ఎంవోయూలు కుదుర్చుకున్నారని.. థర్డ్ పార్టీ అసెస్‌మెంట్ ఎక్కడా జరలేదని సుధాకర్ రెడ్డి తెలిపారు. అసలు డీపీఆర్ లేకుండానే ప్రాజెక్ట్ ఫండ్స్ ఇవ్వాలని కోరారని ఆయన వెల్లడించారు. స్కాం ఎలా జరిగిందో నోట్ ఫైల్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తోందని పొన్నవోలు తెలిపారు. సీఎం చెప్పారు.. మేం చేశామని అప్పటి సీఎస్ ఐవైఆర్ కృష్ఱారావు చెప్పారని సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
Also Read: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా
చట్టం ముందు అందరూ సమానమేనని.. ఎవరూ అతీతులు కారని ఆయన పేర్కొన్నారు. రాజమండ్రిలో చంద్రబాబుకు ప్రభుత్వం భారీ భద్రత కల్పించిందని పొన్నవోలు తెలిపారు. 24 గంటలూ వైద్యులు కూడా అందుబాటులో వున్నారని.. చంద్రబాబుకు కావాల్సిన ఆహారం, మందులు అందుతున్నాయని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు విన్నపాలను సహృదయంతో పరిగణనలోనికి తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు పర్మిషన్ లేనిదే ఆయన బ్లాక్‌కు కూడా వెళ్లలేనంతగా సెక్యూరిటీ వుందన్నారు.
చంద్రబాబు ఆరోగ్య పర్యవేక్షణకు 24 గంటలూ డాక్టర్లు అందుబాటులో వుంటారని ఏఏజీ చెప్పారు. ఎన్ఎస్‌జీ ప్రొటెక్షన్ కంటే ఎక్కువ సెక్యూరిటీ కల్పించామని ఆయన వెల్లడించారు. చంద్రబాబుకు ప్రాణహాని వుందన్న మాట అవాస్తవమని పొన్నవోలు స్పష్టం చేశారు. సీఆర్పీసీ చట్టంలో అసలు హౌస్ అరెస్ట్ అనేదే లేదని ఏఏజీ వెల్లడించారు. సీమెన్స్ వాటా రాకుండానే నిధులు విడుదల చేశారని.. చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేశారని సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఫైనాన్స్ సెక్రటరీపై ఒత్తిడి తీసుకొచ్చారని.. సెక్రటరీ అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు.