చంద్రబాబు కస్టడీతో ఎవరికీ ఏ నష్టమూ వుండదు..: ఏసిబి కోర్టులో ఏఏజి వాదన సాగిందిలా...
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిఐడి దాఖలుచేసిన పిటిషన్ పై ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
విజయవాడ : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు సిఐడి కస్టడీ కోరుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సిఐడి దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఏసిబి కోర్టు ఇవాళ(బుధవారం) విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ గురించి మరింత సమాచారం బయటపడాల్సి వుందని... ఇందుకోసం చంద్రబాబును ఐదురోజులు సిఐడి కస్టడీకి ఇవ్వాలని ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు.
స్కిల్ డెవలప్ మెంట్ పేరిట భారీ అవినీతికి పాల్పడిన చంద్రబాబును అన్ని ఆధారాలతో సిఐడి అరెస్ట్ చేసినట్లు ఏఏజి కోర్టుకు తెలిపారు. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసు... వాటిని రాబట్టేందుకే కస్టడీ కోరుతున్నట్లు పొన్నవోలు కోర్టుకు తెలిపారు.
స్కిల్ డెవలప్ మెంట్ పేరిట ప్రజాధనం దోపిడీకి గురయ్యింది... అంటే ప్రజలకు అన్యాయం జరిగిందని ఏఏజి అన్నారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగి తీరాలని... అందుకోసం ఈ కేసులో ప్రమేయం వున్న ప్రతి ఒక్కరినీ విచారించాల్సి వుందన్నారు.ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడం ముఖ్యమన్నారు. చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని... అందువల్లే సిఐడి కస్టడీ కోరుతోందని పొన్నవోలు వాదించారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో సిఐడి వద్ద సమాచారం ఉందన్నారు. కేవలం చంద్రబాబు స్వార్థపూరిత వ్యవహారాలన్ని బయటకు రాకుండా అడుగడుగునా విచారణను అడ్డుకుంటున్నారని అన్నారు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదన్నారు. కాబట్టి స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంపై పూర్తి సమాచారం దక్కాలంటే చంద్రబాబు విచారణే మార్గమని... అందుకోసం ఆయనను కస్టడీకి అప్పగించేలా ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.