కృష్ణా: ప్రేమించమని వెంటపడ్డాడు. అందుకు యువతి ససేమిరా అంది. అయినా ప్రేమించమని వేధించసాగాడు. యువకుడి వేధింపులపై తల్లిదండ్రులకు యువతి చెప్పడంతో వారు మందలించారు. అయినా మార్పు రాలేదు. పెళ్లి చేసుకుంటావా లేదా లేకపోతే చంపేస్తా అని హెచ్చరించాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కొణిజెర్లలో చోటు చేసుకుంది.  

వివరాల్లోకి వెళ్తే ఝాన్సీ ఓప్రవేట్ కళాశాలలో చదువుతుంది. ఝాన్సీని గోపి అనే యువకుడు ప్రేమించమంటూ వెంటపడేవాడు. రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే సమయంలో తనను ప్రేమించమని వేధించేవాడు. గోపి వేధింపులు తట్టుకోలేక ఝాన్సీ తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు గోపిని పలుమార్లు మందలించారు. అయినా గోపీలో మార్పు రాలేదు. 

అయితే మంగళవారం కళాశాలకు వెళ్లిన ఝాన్సీ ఇంటికి తిరిగి వచ్చే సమయంలో బస్టాండ్ వద్ద అడ్డగించి తనను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించాడు. అందుకు ఝాన్సీ నిరాకరించడంతో చంపుతానని హెచ్చరించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఝాన్సీ ఇంటికి వచ్చి పరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మృతికి గోపియే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

ప్రేమ పేరుతో ఝాన్సీని గోపి వేధించేవాడని మంగళవారం చంపేస్తానని బెదిరించడంతోనే తమ కుమార్తె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు వాపోయారు. గోపినీ వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ఆందోళనకు దిగారు.

మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న గోపి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.