టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ జగన్‌లో ఓ అపరిచితుడు ఉన్నాడని, ఆయన చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఓడితే వైసీపీ మళ్లీ జీవితంలో అధికారం చేపట్టబోదని పేర్కొన్నారు. జగన్‌లో ఈ ఫ్రస్ట్రేషన్ మొదలైందని, అందుకే ఆయన భాష కూడా మారిందని తెలిపారు. 

అమరావతి: టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. ఒక ప్రభుత్వంపై ఈ స్థాయి వ్యతిరేకత తాను చరిత్రలో చూడలేదని అన్నారు. ప్రభుత్వాలు విఫలం అవుతుంటాయని, అది వేరే సంగతి అని, కానీ, పాలనపై ఈ స్థాయిలో ప్రజా ఆగ్రహాన్ని తాను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ అత్యధిక సీట్లు గెలిచిన 1994లో కూడా నాటి ప్రభుత్వంపై ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత తాను
చూడలేదని వివరించారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలే దారుణంగా దెబ్బతింటున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సంక్షేమ పథకాలు కారణం కాదు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కానీ, జగన్ లూటీ వల్లనే ఈ దుస్థితి నెలకొందని ఆరోపణలు చేశారు. జగన్ పథకాల వెనుక ఉన్న లూటీని ప్రజలు గుర్తించారని, వారు ఏం నష్టపోయారో తెలుసుకున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను ధ్వంసం చేసి తన ఆదాయం పెంచుకునే పనులు చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానాకు ఎక్కవ ఆదాయాలు వచ్చేదానిలో అబ్కారీ శాఖ ఉంటుందని, కానీ, జగన్ ఈ విధానంలో
బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. మద్యంపై బహిరంగ దోపిడీ జరుగుతున్నదని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వ్యక్తుల జేబుల్లోకి వెళ్తున్నదని అన్నారు. మైనింగ్, ఇసుకనూ మొత్తంగా దోచేసుకుంటున్నాడని, ఈ భారం ప్రజలపైనే పడుతుందని తెలిపారు.

రైతులకు ఏడాదికి రూ. 7 వేలు ఇచ్చి మిగిలిన బాధ్యతలను విస్మరిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో రైతుల నుంచి ఒక్క ఓటు కూడా వైసీపీకి పడదని చెప్పారు. రాజకీయాల్లో కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకోవడాన్ని తాను ఎప్పుడూ చూడలేదని, కానీ, వైసీపీ ఆ పని చేస్తున్నదని ఆక్షేపించారు. పవన్‌పై కోపంతో ఓ సామాజిక వర్గాన్ని, తనపై కోపంతో మరో సామాజిక వర్గాన్ని, రఘురామ కృష్ణం రాజుపై కోపంతో ఇంకో వర్గాన్ని లక్ష్యం చేసుకున్నారని పేర్కొన్నారు. జగన్‌లో ఓ అపరిచితుడు ఉన్నాడని, ఆయన చెప్పేదానికి,
చేసేదానికి పొంతన ఉండదని అన్నారు. వైసీపీ ఇప్పుడు ఓడిపోతే.. జీవితంలో మళ్లీ అధికారాన్ని చేపట్టే అవకాశమే లేదని తెలిపారు. ఇదే జగన్‌లో తీవ్ర ఫ్రస్ట్రేషన్‌కు కారణం అవుతున్నదని చెప్పారు. ఆ ఫ్రస్ట్రేషన్‌తోనే ఆయన భాష మారిందని అన్నారు.

క్యాబినెట్ విస్తరణతో జగన్ బలహీనుడని తేలిపోయిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒత్తిళ్ల కారణంగా ఆయన సగం మందిని క్యాబినెట్‌లో తిరిగి కొనసాగించారని వివరించారు. ఫలితంగా తిరుగుబాట్లు వచ్చాయని, క్యాబినెట్ విస్తరణ అనంతరం స్వయంగా సీఎం బతిమిలాడుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఏ సీఎం కూడా ఇలా బతిమిలాడుకోలేదని వివరించారు. తన ఇంటి మీద దాడికి వచ్చినవారిని, లోకేష్‌పై దూషించిన వారిని మంత్రులుగా చేశారని, మంత్రి పదవికి అర్హతలు ఇవ్వా? అని ప్రశ్నించారు.

ప్రజల్లోకి వెళ్లడానికి తాము ప్రణాళికలు రెడీ చేసుకున్నామని, బాదుడే బాదుడు పేరుతో టీడీపీ చేస్తున్న పోరాటంలో తాను పాల్గొంటారని వివరించారు. మహానాడు వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, మే మొదటి వారం నుంచి ఆయన పర్యటనలు మొదలవుతాయని తెలిపారు. మహానాడు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తారని, నెలకు రెండు జిల్లాల చొప్పున ఏడాదిలో అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేస్తానని వివరించారు.