విచిత్రమేమిటంటే ప్రత్యర్ధికి వచ్చిన మెజారిటీకన్నా శర్మ పేరుతో పడిన చెల్లుబాటు కానీ ఓట్లే ఎక్కువ.
పాపం ఉత్తరాంధ్ర చిన్నబోయింది. గడచిన పుష్కరకాలంగా అలుపెరుగని ఉద్యమాలు చేస్తున్న ఉద్యమకారుడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోయారు. ప్రత్యర్ధుల చేతిలో ఓడిపోయారనేకన్నా, కాలం కలసిరాలేదని అనుకుంటే బాగుంటుదేమో. ఇదంతా ఎవరిని ఉద్దేశించంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సుమారు 12 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసిన అజాశర్మ గురించే.
ఎల్ ఐసి ఉద్యోగైన అజాశర్మ విశాఖ అభివృద్ధి వేధిక పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారు. ఎన్నో ఉద్యమాలు చేసారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసమని, విద్యా సంస్ధలు కావాలని, ప్రత్యేక రైల్వేజోన్ కావాలంటూ ఇలా..ఏదో ఓ సామాజిక అంశంపైన శర్మ చేసిన ఉద్యమాలు అన్నీ ఇన్నీ కావు. ఉత్తరాంధ్రలో శర్మకు తెలీని ప్రాంతంలేదు..శర్మను తెలీని వారూ లేరంటే అతిశయోక్తి కాదేమో.
అటువంటి శర్మ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎంఎల్సీగా పోటీ చేసారు. ఆయనకు మద్దతుగా జాతీయ నాయకులు లేరు. అంగ, అర్ధబలం లేదు. అయినా ఓటర్లలో అత్యధికులు శర్మకు మద్దతుగా నిలబడ్డారు. తామే ప్రచారం చేసారు. ఎన్నికల ఖర్చులు అవసరం లేదంటూ ఎవరికి వారు శర్మకు ప్రచారం చేసారు. ఎన్నికల్లో శర్మనే గెలవాలని మనస్పూర్తిగా కష్టపడ్డారు. అయినా ‘మనం ఒకటి తలిస్తే దేవుడొకటి తలచాడ’న్న సామెత శర్మకు సరిగ్గా సరిపోతుంది.
శర్మకు పోటిగా టిడిపి మద్దతుతో భాజపా అభ్యర్ధి మాధవ్ పోటీలో నిలిచారు. వెంకయ్యనాయడు సహా పలువురు కేంద్ర నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, రెండు పార్టీల యంత్రాంగాలు మొత్తం రంగంలోకి దిగాయంటేనే శర్మకు ఉత్తరాంధ్రపై ఉన్న పట్టు అర్ధమవుతుంది. అయినా ఏం లాభం. చివరకు ఓడిపోయారు. విచిత్రమేమిటంటే ప్రత్యర్ధికి వచ్చిన మెజారిటీకన్నా శర్మ పేరుతో పడిన చెల్లుబాటు కానీ ఓట్లే ఎక్కువ. బ్యాలెట్ పేపర్లోని వరుస సంఖ్యల్లో శర్మ నెంబర్ 5. అయితే దాని పక్కన ప్రాధాన్యతా ఓట్లలో 1 నెంబర్ వేయాల్సిన ఓటర్లు 5 వేసారు. దాంతో అవన్ని చెల్లని ఓట్లయ్యాయి. అవే సుమారు 10 వేల ఓట్లున్నాయి. ఇదే విషయమై విశాఖలో ఓ సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ, శర్మ ఓడిపోవటం ఉత్తరాంధ్రకు పెద్ద దెబ్బగా వర్ణించారు.
