అనంతపురం: సొంత నియోజకవర్గం హిందూపురంలో సినీ  హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు ఘోరంగా పరాజయం పాలయ్యారు. 

హిందూపురం నియోజకవర్గంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకె పార్థసారథికి కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఆయన సొంత గ్రామ పంచాయతీ రొడ్డంలో టీడీపీ పరాజయం పాలైంది. బికే పార్థసారథి సొంత వార్డు మరువపల్లిలో కూడా టీడీపీకి పరాభం తప్పలేదు.

పెనుకొండ శాసనసభ నియోజకవర్గంలోని 80 స్థానాల్లో 71 స్థానాలు వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. హిందూపురం మాజీ ఎంపీ కిష్టప్పకు కూడా పరాభవం తప్పలేదు. నిమ్మల కిష్టప్ప సొంత గ్రామ పంచాయతీ వెంకటరమణ పల్లిలో టీడీపీ పరాజయం పాలైంది. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు కూడా షాక్ తగిలింది. ఆయన సొంత గ్రామ పంచాయతీ మద్దనకుంటలో టీడీపీ ఓడిపోయింది.

కాగా, గ్రామ పంచాయతీ నాలుగో విడత ఎన్నికల ఫలితాలు ఆదివారం సాయంత్రం వెలువడ్డాయి. అత్యధిక స్థానాలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. నాలుగు విడతల్లో జిరగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 13,097 స్థానాలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.