Asianet News TeluguAsianet News Telugu

ఇసుకలో కూరుకుపోయిన 300 యేళ్లనాటి శివాలయం.. గ్రామస్తులు ఎలా వెలికితీశారంటే..

పెన్నా నదికి 1850లో వచ్చిన వరదల తరువాత ఆలయం ఇసుకలో కూరుకుపోవడం ప్రారంభమై ఉండొచ్చని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. వరదలు గ్రామాన్ని ముంచెత్తడంతో ప్రజలు నది ఒడ్డునుంచి దూరంగా వెళ్లిపోయారు. 

A 300-year-old temple stuck in the sand in nellore.. How did the villagers unearth it - bsb
Author
First Published Dec 29, 2023, 9:55 AM IST

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓ అద్భుత ఘటన వెలుగు చూసింది. పెన్నా నది ఒడ్డున ఎనిమిది దశాబ్దాలుగా ఇసుకలో కూరుకుపోయిన నాగేశ్వర స్వామి చారిత్రాత్మక దేవాలయం బయటపడింది. చేజర్ల మండలం (బ్లాక్) పరిధిలోని పెరుమాళ్లపాడు గ్రామానికి చెందిన కొందరు స్థానిక యువకులు చేపట్టిన ఇసుక తవ్వకాల్లో పరశురాముడు ప్రతిష్ఠించినట్లుగా చెబుతున్న శివాలయం వెలుగు చూసింది.

దాదాపు 80 ఏళ్ల క్రితం నుంచి ఇసుక దిబ్బల కింద దేవాలయం ఉందని తమ పెద్దలు చెప్పారని.. నిజం వెలికితీయడానికి తవ్వకాలు చేపట్టామని స్థానికులు చెబుతున్నారు. ఇసుక తవ్వకాలు కొనసాగించాలని అధికారులను కోరితే.. దీని వల్ల నిర్మాణం దెబ్బతింటుందని అధికారులు అడ్డుకున్నారు.

1850లో పెన్నా నదికి వచ్చిన వరదల కారణంగా ఆలయం ఇసుకలో పూడుకుపోయి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. వరదలు గ్రామాన్ని ముంచెత్తడంతో ప్రజలు నది తీరంనుంచి దూరంగా వెళ్లిపోయారు. దీంతో దీని చరిత్ర పూర్తిగా మరుగున పడిపోయింది.

Chandrababu: "వారి సినిమా దగ్గరపడింది.. ఇక 100 రోజులే మిగిలాయి.. " 

పురావస్తు శాఖ సహాయ సంచాలకులు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారులు త్వరలో స్థలాన్ని పరిశీలించి తవ్వకాలు, పరిరక్షణ పనులపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పెరుమాళ్లపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయాన్ని చూసేందుకు, పూజలు చేసేందుకు తరలివస్తున్నారు. కొంత మంది పోలీసులను కాపలాగా ఉంచారు.

గ్రామస్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాన్ని పునరుద్ధరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని కోటితీర్థం ఆలయం, సంగమ శివాలయంతో పాటు శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం 300 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని నమ్ముతున్నారు. లాక్‌డౌన్ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి చేరుకున్న గ్రామ యువకులు ఆలయాన్ని వెలికితీసేందుకు ఇసుక తవ్వకాలు చేశారు.

"ఇది గ్రామస్తుల కల. మా పెద్దల నుండి పురాతన దేవాలయం గురించి విన్నాం. మేం ఇంట్లో ఖాళీగానే ఉన్నాం. అందుకే గుడిని వెలికి తీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. మా కల నెరవేరింది’’ అని యువకుల్లో ఒకరు చెప్పారు.

సుమారు 35 మంది గ్రామస్తులు ఈ పనిని చేపట్టారు. దీనికి ముందు స్థానిక అధికారుల నుండి అనుమతి తీసుకున్నారని చెప్పారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆలయానికి 110 ఎకరాల భూమి ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆలయం ఇసుకలో కూరుకుపోవడంతో ఆ భూముల ద్వారా వచ్చే ఆదాయం దేవాదాయ శాఖకు జమ అవుతోంది.

ఈ భూముల ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి ఎలాంటి లెక్కలు లేవని, అధికారులు అన్ని వివరాలు బయటకు వచ్చి ఆలయ పునరుద్ధరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 68 ఎకరాల భూమిలో అద్దె రూపంలో వచ్చిన నాలుగు లక్షల రూపాయలను బ్యాంకులో జమ చేసినట్లు దేవాదాయ శాఖ స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఆలయ పునరుద్ధరణపై ప్రజాప్రతినిధులతో చర్చలు జరపాలని పురావస్తు శాఖ యోచిస్తోంది.

హిందూ మత పెద్ద స్వామి కమలానంద భారతి కూడా ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పునరుద్ధరణకు అధికారులు తక్షణమే పనులు చేపట్టాలని హిందూ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోని స్వామి డిమాండ్ చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios