అనంతపురం ఎగ్జిబిషన్ లో కూలిన జాయింట్ వీల్: పదేళ్ల చిన్నారి మృతి (వీడియో)

A 10-year-old girl died after a giant merry-go-round wheel crashed at Anantapur
Highlights

మరో ఆరుగురికి తీవ్ర గాయాలు

అనంతపురం లో జరుగుతున్న ఓ ఎగ్జిబిషన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎగ్జిబిషన్ నిర్వహకుల నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకోవడంతో  పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ జూనియర్ కాలేజి ప్రాంగణంలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. అయితే నిన్న ఆదివారం కావడం, వేసవి సెలవులు ముగిసి మరో మూడు రోజుల్లో స్కూళ్లు ఓపెన్ అవుతుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో సరదాగా గడపాలని ఎగ్జిబిషన్ కు భారీగా వచ్చారు. అయితే ఈ ప్రమాదం కారణంగా అప్పటివరకు కేరింతలు వినపడ్డ ఎగ్జిబిషన్ లో హాహాకారాలు వినబడ్డాయి.  
 
ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన జాయింట్ వీల్ ను ఎక్కిన పిల్లలు, పెద్దలు ఆనందంగా కేరింతలు కొడుతున్న వేళ, ఆ జెయింట్ వీల్ విరిగిపడింది. జాయింట్ వీల్ వేగంగా తిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ట్రాలీ బోల్టు ఊడిపోయి ప్రమాదం సంభవించింది.  ఈ దుర్ఘటనలో అమృత అనే 10 ఏళ్ల పాప అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడినవారిలో కూడా ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

గాయపడిన వారిని అనంతపురం జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాద సమయంలో జాయింట్ వీల్ ఆపరేటర్ ఫుల్లుగా మద్యం సేవింంచి ఉన్నాడని సందర్శకులు తెలిపారు. అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.దీనిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 

loader