కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో దారుణం జరిగింది. రెండవ తరగతి చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే...గ్రామానికి చెందిన ఓ బాలిక  స్ధానికంగా ఉన్న ఓ పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది.

ఈ నెల 22న స్కూలుకి హాజరైన ఆమె సాయంత్రం 5 గంటలకు నడవలేని స్థితిలో ఇంటికి వచ్చింది. మర్మావయవాల వద్ద రక్తస్రావం కావడాన్ని గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఎంతకు రక్తస్రావం ఆగకపోవడంతో వైద్యులు ఆమెకు కుట్లు వేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

వైద్య పరీక్షల నిమిత్తం బాలికను తొలుత నూజీవీడు ఆస్పత్రికి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యుడైన హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడు గంపా వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ఆదేశాలు జారీ చేశారు.