తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో 8మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 26కి చేరాయి. మొన్నటి వరకు 18కేసులు ఉండగా.. తాజా కేసులతో కలిపి 26కి చేరింది.

రాజమండ్రిలో కొత్తగా మూడు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి వైద్య చర్యలు చేపట్టారు. ప్రతి కంటైన్మెంట్ జోన్‌కు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిత్యావసరాలు సరఫరా చేసేందుకు రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదిలా ఉండగా... ఇటీవల రాజమండ్రిలో కరోనా సోకిన మహిళకు రహస్యంగా వైద్యం అందించిన ఆర్ఎంపీ డాక్టర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆర్ఎంపీ డాక్టర్ కాంటాక్ట్ లను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు జిల్లాకు వచ్చిన 7,423 రాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా నేటి నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.

కాగా... రాష్ట్రంలో కరోనా కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. గత 24 గంటల్లో తాజాగా 75 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 722కు చేరుకుంది. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. సోమవారం ప్రభుత్వ ఆరోగ్య శాఖ మూడు మరణాలను ధ్రువీకరించింది. 

దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది మృత్యువాత పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ సోమవారం మధ్యాహ్నం బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు 92 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 610 ఉంది. కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 

కర్నూలు జిల్లాలో 174 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లా 149 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 

గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి.

 కృష్ణా జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి.  చిత్తూరు జిల్లాలో 25 కేసులు, గుంటూరు జిల్లాలో 20 కేసులు, కడప జిల్లాలో మూడు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కేసులు తాజాగా నమోదయ్యాయి. ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కాలేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.