రానున్న ఎన్నికల్లో గెలుపు లక్ష్యంతో వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు. పాదయాత్రలో వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొన్ని టిక్కెట్లను ఫైనల్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని టిక్కెట్లను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. టిక్కెట్ల కేటాయింపులో పోయిన ఎన్నికల్లో చేసిన తప్పులను మళ్ళీ జరగకుండా జగన్ ముందు జాగ్రత్త పడుతున్నారు. పోయిన ఎన్నికల్లో జగన్ చాలా తప్పులు చేశారు. దాని ఫలితమే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి రావటం.

పోయిన సారి జగన్ చేసిన తప్పులేంటంటే,

1-చివరి నిముషం వరకూ చాలా చోట్ల టిక్కెట్లను ఖరారు చేయలేదు.

2-ఖరారు చేసిన టిక్కెట్లను కూడా చివరి నిముషంలో మార్చేయటం.

3-ఒక నియోజకవర్గంలో అప్పటి వరకూ ఇన్చార్జిలుగా కష్టపడిన వారికి టిక్కెట్లు ఇవ్వకపోవటం

4-నియోజకవర్గం ఇన్చార్జిలుగా ఉన్న వారికి చివరి నిముషంలో వేరే నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఇవ్వటం.

5-ఎలాగూ గెలుపు తమదే అన్న ఉద్దేశ్యంతో చాలామంది డబ్బు ఖర్చు చేయలేదు.

6-వైసిపి అభ్యర్ధులు గెలిచేస్తున్నారంటూ జగన్ మీడియా ఒకటే ఊదరగొట్టటం కూడా పెద్ద మైనస్ అయ్యింది.

7-చాలా నియోజకవర్గాల్లో టిక్కెట్ల కేటాయింపుల్లో సామాజికవర్గ సమతూకాన్ని జగన్ పాటించలేదు

ఇటువంటి తప్పుల వల్ల చాలా చోట్ల వైసిపి అభ్యర్ధులు తక్కువ తేడాతో ఓడిపోయారు. 1500 లోపు ఓట్ల తేడాతో సుమారు 20 మంది అభ్యర్ధులు ఓడిపోయారు. 1500-2 వేల తేడాతో మరో 10 మంది ఓడిపోయారు. కారణాలేమైనా కానీ చేసిన తప్పుల వల్ల అధికారంలోకి రావాల్సిన జగన్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. దానికితోడు చంద్రబాబునాయుడు, నరేంద్రమోడి, పవన్ కల్యాణ్ ఓ కూటమిగా ఏర్పడటంతో జగన్ ఓటమి ఖాయమైంది.

 అయ్యిందేదే అయిపోయిందన్న ఉద్దేశ్యంతో జగన్ ముందు జాగ్రత్త పడుతున్నారు. ప్రత్తికొండ, కుప్పం, నంద్యాలలో టిక్కెట్లు ఇప్పటికే ప్రకటించేశారు. ప్రస్తుతమున్న 44 మంది  సిట్టింగ్ ఎంఎల్ఏల్లో 35 మందికి టిక్కెట్లు ఖాయమట. అలాగే, ఆచంట, నరసాపురం, పాలకొల్లు లాంటి చోట్ల కూడా దాదాపు ఫైలన్ చేసేసారట. మొత్తం మీద వైసిపి వర్గాలు చెప్పిన దానిప్రకారం సుమారు 100 టిక్కెట్లు ఖాయం చేసారట.

అభ్యర్ధుల ఎంపికలో సామాజికవర్గ సమీకరణలు, ఆర్ధిక, నియోజకవర్గంలో గుడ్ విల్ లాంటి అంశాలనూ బేరీజు వేసుకున్నారట. చూడబోతే 2019లో గెలుపు లక్ష్యంతో జగన్ పక్కాగా అభ్యర్ధులు ఎంపిక చేస్తున్నారు. సరే, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహాలు ఎటూ ఉన్నాయనుకోండి అది వేరే సంగతి.