అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. మంగళవారంనాటి కన్నా ఈ రోజు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 68కి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 9,159 శాంపిల్స్ ను పరీక్షించగా 68కి పాజిటివ్ గా ఉన్నట్లు తేలింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2407కు చేరుకుంది. 

కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో మరొకరు మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 53కు చేరుకుంది. ఇప్పటి వరకు 1639 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జీ కాగా, ప్రస్తుతం 715 మంది చికిత్స పొందుతున్నారు. 

 

తాజాగా నమోదైన కేసుల్లో 10 కోయంబేడు మార్కెట్ తో లింకులున్న కేసులు. చిత్తూరు జిల్లాలో ఆరు, నెల్లూరు జిల్లాలో నాలుగు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కోయంబేడుతో లింకులున్నవి. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. 

ట్విట్టర్ లో ఇప్పటి వరకు జిల్లాలవారీగా లెక్కలు ఇస్తూ వచ్చిన ఆరోగ్య శాఖ ప్రస్తుతం కేవలం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్యను మాత్రమే ఇస్తోంది.