నెల్లూరుపైనా కోయంబేడు దెబ్బ: ఏపీలో మరో 62 పాజిటివ్ కేసులు, మరో మరణం
ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాపైనే ప్రభావం చూపిన కోయంబేడు లింక్ తాజాగా నెల్లూరు జిల్లాపైనా పడింది. నెల్లూరు జిల్లాలో గత 24 గంటల్లో కోయంబేడు లింకులున్న కేసులే 14 నమోదయ్యా.యి.
అమరావతి: లాక్ డౌన్ ఆంక్షల సండలింపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో మరో 62 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో మరణం సంభవించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నెల్లూరు జిల్లాపై కూడా కోయంబేడు దెబ్బ పడింది.
రాష్ట్రంలో 8,415 శాంపిల్స్ ను పరీక్షించగా 62 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా గత 24 గంటల్లో 51 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. కరోనా వల్ల గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 2514 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1731 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా, 55 మంది మరణించారు. 728 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గత 24 గంటల్లో నమోదైన 62 కేసుల్లో తమిళనాడులో కోయంబేడుకు సంబంధం ఉన్న కేసులు 18 ఉన్నాయి. కోయంబేడు నుంచి వచ్చిన 18 మందిల్లో నలుగురు చిత్తూరు జిల్లాకు చెందినవారు కాగా, 14 మంది నెల్లూరు జిల్లాకు చెందినవారు.