అనంతపురం జిల్లాలో టిడిపికి పెద్ద షాక్ తగిలింది. కదిరి మాజీ ఎంఎల్ఏ కందికుంట వెంకట ప్రసాద్ కు బుధవారం నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. గతంలో ఎస్బీఐ డిమాండ్ డ్రాఫ్టులను ఫోర్జరీ చేసారన్న కేసులో కందికుంటపై ఎప్పటి నుండో విచారణ జరుగుతోంది. ఆ విషయం టిడిపిలో అందరకీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో కందికుంట వైసీపీ అభ్యర్ధి అత్తార్ చాంద్ భాషపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మారిన రాజకీయ పరిస్ధితుల్లో చాంద్ భాషా  వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించిన సంగతీ అందరికీ తెలిసిందే.

అప్పటి నుండి ఇద్దరికీ పడటం లేదు. ఒక దశలో కందికుంట టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఎందువల్లో అడుగులు ముందుకు పడలేదు. కానీ చాంద్ భాష మాత్రం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టుపై అనుమానంతోనే ఉన్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో ఒకవైపు చాంద్ భాషాతో వైరం నడుస్తూండగానే కందికుంట మరోవైపు కోర్టులో విచారణను కూడా ఎదుర్కొంటున్నారు. దాంతో కందికుంట రాజకీయ జీవితంపై అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.

ఆ అనుమానాలను నిజం చేస్తూ నాంపల్లి కోర్టు కందికుంటకు ఐదేళ్ళ జైలుశిక్షను విధించింది. కందికుంటతో పాటు అప్పటి బ్యాంకు మేనేజర్ కుడా ఐదేళ్ళు శిక్ష విధించింది. న్యాయపరమైన పరిణామాలు ఒకవిధంగా భాషాకు సానుకూలమే అయినా టిడిపికి మాత్రం రాజకీయంగా పెద్ద దెబ్బే. ఎందుకంటే, కందికుంట స్ధానికంగా బాగా పట్టున్న నేత. అందుకే కందికుంటకు న్యాయస్ధానం శిక్ష విధించినట్ల తెలియగానే జిల్లా నేతలందరూ డీలా పడిపోయారు. నాంపల్లి కోర్టు తీర్పుపై కందికుంట ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.