అల్లూరి సీతారామరాాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో పొట్టకూటికోసం ఆంధ్ర ప్రదేశ్ కు వలసవస్తున్న ఒడిశా కూలీలు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు వున్నారు. 

పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ప్రైవేట్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడటంతో ఒడిశాకు చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్సపొందుతున్నారు.

ఒడిశాకు చెందిన కొందరు ఉపాది నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నపల్లి నుండి సంగీత ట్రావెల్స్ బస్సులో కూలీలంతా విజయవాడకు బయలుదేరారు. అయితే కూలీలు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ చింతూరు మండలం ఏడురాళ్ళపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. రోడ్డుపైనే పల్టీలు కొడుతూ బస్సు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా వున్నారు. మృతులు ధనేశ్వర్‌ దళపతి(24), జీతు హరిజన్‌(5), సునేనా హరిజన్‌(2) కాగా హాస్పిటల్ లో చనిపోయిన మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి వుంది.

బస్సు ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరకుని ముందుగా గాయాలపాలైన వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఒడిశాలోని స్వస్థలానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

తెలంగాణలో ఇలాగే నిన్న(ఆదివారం) జరిగిన ఘోర రోడ్డుప్రమాదం ముగ్గురిని బలితీసుకుంది. మద్యం మత్తులో డ్రైవర్ లారీ నడుపుతూ రాంగ్ రూట్ లో వచ్చి కారును డీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ద దంపతులతో పాలు కారు డ్రైవర్ మృతిచెందాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం శివారులో రాజీవ్ రహదారిపై ఆదివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. 

కరీంనగర్ పట్టణానికి చెందిన రిటైర్డ్ అధ్యాపకులు తాండ్ర పాపారావు(62), ఆయన భార్య పద్మ(56) ఓ అద్దెకారులో కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును అదే జిల్లాలోని నాగుల మల్యాలకు చెందిన గొంటి ఆంజనేయులు(48) నడుపుతున్నారు. మల్లారం శివారులోకి రాగానే ఎదురుగా రాంగ్ రూట్లో వేగంగా వస్తున్న లారీ ముందు నుంచి కారును ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. 

లారీ డ్రైవర్ కాళ్లూ, చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటికి తీసి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వనపర్తి జిల్లా జూరాలకు చెందిన లారీ డ్రైవర్ శ్రీనివాస్ తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.