అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి విస్తరిస్తూనే ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి వల్ల ఏపీలో కోవిడ్ -19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 4 వేలు దాటింది. తాజాగా గత 24 గంటల్లో 138 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 

రాష్ట్రంలో 50 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 84 మందికి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. విదేశాల నుంచి వచ్చినవారిలో నలుగురికి కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. 

తాజాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు కరోనా వైరస్ బారిన పడి మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 73కు చేరుకుంది. కృష్ణా జిల్లాలోనే తాజాగా రెండు మరణాలు సంభవించాయి. కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్న 21 మందిని శుక్రవారం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. 

కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,250కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2294 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 9,831 శాంపిల్స్ ను పరీక్షించారు. ప్రస్తుతం 1060 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.