కృష్ణా జిల్లా అవనిగడ్డ చల్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న బాలుడిని అతి కిరాతకంగా హత్య చేశారు. అవనిగడ్డ ప్రాంతానికి చెందిన దాసరి ఆదిత్య అనే బాలుడు చల్లపల్లి బీసీ హాస్టల్లో ఉంటూ మూడో తరగతి చదువుకుంటున్నాడు. కాగా... మంగళవారం ఉదయం బాత్రూమ్ లో శవమై కనిపించాడు.

అతని గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. బాలుడు అలా రక్తమడుగులో పడి కనిపించడంతో.. వెంటనే హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. కాగా.. తమ కుమారుడు బాగా చదువుకుంటాడని హాస్టల్ లో చేర్పిస్తే... ఇలా శవమై కనిపిస్తాడని ఊహించలేదని ఆదిత్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా.. బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందా అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తమకు ఎవరితో ఎలాంటి ఆస్తి గొడవలు కూడా లేవని.. అసలు ఒకరితో గొడవలు పడేంత ఆస్తి కూడా తమకు లేదని బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అంత ఆస్తి తమ వద్ద ఉంటే కుమారుడిని హాస్టల్ లో ఉంచాల్సిన అవసరం లేదు కదా అని వాపోతున్నారు. దీంతో.. పోలీసులు దీనిని ఓ మిస్టరీగా భావిస్తున్నారు. అనుమానితులుగా అనిపిస్తున్న వారందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.