Asianet News TeluguAsianet News Telugu

వారణాసిలో పడవ ప్రమాదం.. 34 మంది నిడదవోలు వాసులకు తప్పిన ప్రమాదం..

ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో గంగానదిలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలు వాసులు ప్రాణాలతో బయటపడ్డారు. పడవలోని 34 మంది యాత్రికులను స్థానిక ఈతగాళ్లు, రివర్ పోలీసులు రక్షించారు.
 

34 pilgrims from Andhra Pradesh Nidadavole rescued after boat mishap in Varanasi
Author
First Published Nov 27, 2022, 1:18 PM IST

ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో గంగానదిలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలు వాసులు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నుంచి వందమందికి పైగా తీర్థయాత్రలకు వెళ్లారు. అలహాబాద్, గయ, అయోధ్యను సందర్శించుకుని శుక్రవారం వారణాసి చేరుకున్నారు. గంగా నదిలో పిండ ప్రధానాలు చేసేందుకు 34  మంది యాత్రికులు శనివారం తెల్లవారుజామున బోటును అద్దెకు తీసుకుని నది మధ్యలోకి పూజల నిమిత్తం బయలుదేరారు.  కేదార్ ఘాట్ నుంచి బోటు ఎక్కి మణికర్ణిక ఘాట్‌కు వెళ్తున్నారు. పడవ దర్భంగా ఘాట్ గుండా వెళుతున్నప్పుడు.. ఒక్కసారిగా పడవలోకి నీరు రావడం మొదలైంది. 

దీంతో పడవలోని యాత్రికులు తీవ్ర ఆందోళన చెందారు. అరుపులు, కేకలు వేయడం ప్రారంభించారు. ప్రమాదాన్ని గ్రహించిన యాత్రికులు కొందరు గంగా నదిలోకి దూకడం ప్రారంభించారు. అయితే స్థానికంగా ఉండే పడవలు నడిపే వాళ్లు, ఈతగాళ్లు, రివర్ పోలీసుల తక్షణమే స్పందించడంతో.. యాత్రికులందరిని ప్రాణాలను రక్షించడం సాధ్యమైంది. 

అయితే ఇద్దరు యాత్రికుల పరిస్థితి కొంచెం విషమంగా ఉండటంతో వారణాసిలోని కబీర్ చౌరాలోని డివిజనల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు కూడా అక్కడకు చేరుకున్నారు. పడవలోని మొత్తం 34 మంది యాత్రికులు రక్షించబడ్డారని అధికారులు చెప్పారు. చాలా సేపు నీళ్లలో ఉండటం వల్ల పి ఆదినారాయణ (61), పి విజయల ఆరోగ్యం క్షీణించిందని.. అయితే సరైన చికిత్స అందించడంతో వారి పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్యం అందజేస్తామని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక, యాత్రికులు వారణాసి నుంచి నిడదవోలుకు తిరుగు పయనమయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios