ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది.వరద ఉధృతికి పోలవరం ప్రాజెక్టు ఎగువన కాఫర్ డ్యామ్ వద్ద 31 మంది మత్స్యకారులు చిక్కుకొన్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎప్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరానికి చెందిన 31 మంది మత్స్యకారులు 19 పడవల్లో 80 రోజుల క్రితం మరబోట్లతో చేపలవేటకు వెళ్లారు. పది రోజులుగా గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. కూనవరం నుండి ధవళేశ్వరం వెళ్తుండగా వీరవరపు లంక సమీపంలోలోని పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద చిక్కుకొన్నారు.

నది మధ్యలో చిక్కుకొన్న వారిలో 19 మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. ఉదయం నుండి ఆహారం లేక ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు.కాఫర్ డ్యామ్‌పైకి చేరుకొన్న వారిని రక్షించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు విపలమయ్యాయి. మత్స్యకారులు తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు.

వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న కారణంగా గజ ఈతగాళ్లు ఈ ప్రాంతానికి చేరుకోలేకపోతున్నారు. మత్స్యకారులను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.