పొలం తగాదాల నేపథ్యంలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కాంపల్లెకు చెందిన జయచంద్రారెడ్డి, రవీంద్రరెడ్డికి మధ్య పొలం గొడవలు ఉన్నాయి.

దీనిపై వీరిద్దరూ తరచుగా గొడవ పడేవారు. రెండు నెలల క్రితం వీరిపై పూతలపట్టు పోలీస్ స్టేషన్‌లో కేసు సైతం నమోదైంది. జయచంద్రారెడ్డికి తల్లిదండ్రులు లేరు.. వివాహం కాకపోవడంతో అక్క వద్ద వుంటూ హోటల్‌లో పనిచేస్తూ జీవిస్తూ ఉండేవాడు.

ఈ క్రమంలో ఆదివారం రేషన్ బియ్యం కోసం గ్రామానికి వచ్చిన అతను రవీంద్రారెడ్డి పొలం వద్దకు వెళ్లాడు. మరోసారి పొలం గురించి అతనితో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన రవీంద్రారెడ్డి తన ఇంటిలో ఉన్న కొడవలి తీసుకువచ్చి జయచంద్రారెడ్డిని విచక్షణారహితంగా నరికాడు.

తీవ్రగాయాలైన అతను పొలం వద్దే కుప్పకూలిపోయాడు. దీంతో కంగారుపడిన రవీంద్రారెడ్డి ఇంటికి తాళం వేసుకుని కుటుంబంతో సహా పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని జయచంద్రారెడ్డి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడు రవీంద్రారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.