తిరుపతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయమవ్వడం కలకలం రేపుతోంది. శనివారం సాయంత్రం ఆలయంలో ఉత్సవమూర్తులకు చెందిన మూడు కిరీటాలు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. 

దీంతో రంగంలోకి దిగిన టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారులు, పోలీసులు ఉన్నతాధికారులు ఆలయానికి చేరుకుని ప్రధాన ద్వారాన్ని మూసి వేసి విచారణ చేపట్టారు. ఆగమేఘాలపై అర్చకులందరినీ ఆలయానికి పిలిపించారు. 

ఎలాంటి సమాధానం రాకపోవడంతో క్లూస్ టీంతో రంగంలోకి దిగారు. మరోవైపు సిసీ పుటేజీని సైతం పరిశీలించారు. గోవిందరాజస్వామి ఆలయంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఉప ఆలయంలో కొలువైన శ్రీదేవి, భూదేవిసమేత మలయప్ప ఉత్సవ మూర్తుల మూడు కిరీటాలు కనిపించకుండా పోయాయని తమకు ఫిర్యాదు అందిందని తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ స్పష్టం చేశారు. 

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మూడు కిరీటాలు కలిపి 1300 గ్రాముల బరువుంటాయని వివరించారు. చోరీకి సంబంధించి స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అర్బన్ ఎస్పీ వెల్లడించారు. 

ఇకపోతే శ్రీవేంకటేశ్వరస్వామి అన్న అయిన శ్రీ గోదవిందరాజస్వామి ఆలయాన్ని 12వ శతాబ్ధంలో శ్రీరామామానుజాచార్యులు నిర్మించారు. తిరుమల కొండకు వచ్చిన ప్రతీ భక్తుడు తిరుపతిలోని గోవిందరాజస్వామిని దర్శించుకుంటారు.

శ్రీవారికి సమర్పించినట్టే గోవిందరాజస్వామికి కూడా రాజులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బంగారు, వజ్రాలతో పొదిగిన ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో పొదిగిన కిరీటాలు కానుకలుగా సమర్పించారు. కాగా శ్రీగోవిందరాజస్వామికి ప్రధానంగా ఐదు బంగారు కిరీటాలు ఉన్నట్లు సమాచారం. 

అయితే నిత్యం స్వామి వారికి అలంకరించి ఉండే మూడు కిరీటాలు మాయమవ్వడం ఇప్పుడు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మాయమైన కిరీటాలను సదా సమర్పణ కిరీటాలు అని పిలుస్తారు. నాలుగేళ్ల క్రితం తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో పనిచేసే అధికారి ఒకరు విలువైన ఆభరణాలను మాయం చేసి తాకట్టుపెట్టిన విషయం తెలిసిందే. 

ఈ కేసు ఇంకా విచారణ జరుగుతుండగానే... తాజాగా  శ్రీగోవింద రాజస్వామి ఆలయంలో బంగారు కిరీటాలు మాయం కావడం సంచలనంగా మారింది. చోరీకి సంబంధించి స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అర్బన్ ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు.