ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన నేపథ్యంలో అమరావతిలో రైతులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. లేజిస్లేటివ్ క్యాపిటల్‌గా విశాఖ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా.. వైజాగ్‌కు తుఫాన్ల బెడద ఎక్కువనే వాదనలు వినిపిస్తున్నాయి.

దీనిపై ఏయూ మెట్రాలజీ మాజీ విభాగాధిపతి, వాతావరణంపై ప్రొఫెసర్ భానుకుమార్ స్పందించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు అనువైన భౌగోళిక పరిస్ధితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గడచిన వందేళ్ల వాతావరణ పరిస్ధితులను పరిశీలిస్తే హుద్ హుద్ తప్పితే.. విశాఖను నేరుగా తాకిన తుఫాన్‌లు లేవని వెల్లడించారు.

Also Read:ఏపీకి మూడు రాజధానులు: వెలగపూడిలో రైతుల దీక్షలు

విశాఖ కంటే అమరావతిపైనే తుఫాన్‌ల ప్రభావం ఎక్కువని భానుకుమార్ పేర్కొన్నారు. ఒకేసారి అసాధారణంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం పడినా కూడా సముద్రతీర ప్రాంతం వల్ల విశాఖకు మేలు జరుగుతుందన్నారు.

అన్ని కాలాల్లోనూ విశాఖలో అనువైన వాతావరణం ఉంటుందని, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ నిర్ణయమన్నారు. ఇదే సమయంలో ఎకనామిస్ట్, ఏయూ మాజీ ఆర్థిక విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీరామమూర్తి సైతం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు.

విశాఖలో చాలా తక్కువ ఖర్చుతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేసుకునే వనరులు ఉన్నాయని స్పష్టం చేశారు. దేశ ఆర్ధిక రాజధాని ముంబైని మించి విశాఖ నగరం అభివృద్ధి చెందడానికి అవకాశ ఉందని శ్రీరామమూర్తి తెలిపారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని ఆయన వెల్లడించారు.

Also Read:రాజధానిలో మా భూమి లేదు... బుగ్గన ఆరోపణలపై హెరిటేజ్

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే రాష్ట్రంలో జీడీపీ రేటు అభవృద్ధి చెంది హ్యాపీ ఇండెక్స్ ర్యాంక్ కూడా పెరుగుతుందని శ్రీరామమూర్తి తెలిపారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో రెండు, మూడు రాజధానులు ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.