తిరుమలలో శనివారం జరిగిన డయల్ యువర్ టీటీడీ ఈఓ కార్యక్రమం ముగిసింది. ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. 

వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి పదిరోజులకు లక్ష ఉచిత దర్శన టోకన్లు జారీ చేస్తామని, 24వ తేది వైకుంఠ ద్వారా దర్శన ఉచిత టోకన్లను జారీ చేస్తామని, ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్ కింద టికెట్లను జారీ చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.

తిరుపతిలో ఐదు ప్రదేశాల్లో 50 కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, వీటిద్వారా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబర్ 25 నుండి జనవరి 3వ తేది వరకు రోజుకు పదివేల టికెట్ల చొప్పున జారీ చేస్తామని తెలిపారు.

ఉచిత దర్శన టోకన్లు పొందే భక్తులు తమ సొంత ఏర్పాట్లతో తిరుపతిలో బస చేసేలా సిద్ధమై రావాలని సూచించారు. శీతాకాలం తర్వాత ఆర్జిత సేవల పునరద్ధరణ గురించి ఆలోచిస్తామన్నారు. 

65 ఏళ్ల పైడిన వృద్ధులు, 10 సంవత్సరాలు లోపు పిల్లలు శ్రీవారి దర్శనానికి రాకపోవడమే మంచిదని సూచించారు. ఒకవేళ వృద్ధులు, చిన్న పిల్లలు తిరుమలకు వస్తే వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 

ఈ నెల 30న ప్రణయ కలహ మహోత్సవం, శ్రీవారి కైంకర్యానికి వినియోగించే పుష్పాలు కోసం పవిత్ర ఉద్యానవనం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. నకీలి వెబ్ సైట్లను గుర్తించేందుకు సైబర్ టీంను ఏర్పాటు చేసినట్టు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు.