ఏపీలో 5858కి చేరిన కరోనా కేసులు: మరో ఇద్దరి మృతితో 82కు చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. తాజాగా మరో 222 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ -19తో మరో ఇద్దరు మరణించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాపిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 200కు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 222 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5858కి చేరుకుంది.
గత 24 గంటల్లో ఏపీకి చెందినవారిలో 186 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 33 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ యింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 5858కి చేరుకుంది.
కాగా, గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఇద్దరు మరణించారు. ఈ రెండు మరణాలు కూడా కృష్ణా జిల్లాలో సంభవించాయి. దీంతో కరోనా వైరస్ తో రాష్ట్రంలో మరణించినవారి సంఖ్య 82కు చేరుకుంది. గత 24 గంటల్లో 14,477 శాంపిల్స్ ను పరీక్షించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 2641 మంది డిశ్చార్జ్ కాగా, 1865 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో 202 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. గత 24 గంటల్లో ఒకరు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 180 ఉంది.
ఇదిలావుంటే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 1068 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. గత 24 గంటల్లో 51 మంది కోవిడ్ -19 వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 546 యాక్టివ్ కేసులు ఉన్నాయి.