2017: వార్తల్లో నేతలు

First Published 29, Dec 2017, 1:06 PM IST
2017 news makers of tdp and ycp
Highlights
  • సంవత్సరం మొత్తం తమ వ్యవహారశైలితో ప్రతీ రోజూ మీడియాలో కావచ్చు, జనాల నోళ్ళల్లో కావచ్చు ప్రచారంలో ఉండేట్లు చూసుకోవటం అందరికీ సాధ్యం కాదు.

సంవత్సరం మొత్తం తమ వ్యవహారశైలితో ప్రతీ రోజూ మీడియాలో కావచ్చు, జనాల నోళ్ళల్లో కావచ్చు ప్రచారంలో ఉండేట్లు చూసుకోవటం అందరికీ సాధ్యం కాదు. రాష్ట్రంలో ఎంఎల్ఏలు, ఎంపిలు కలిపి 200 మంది ఉన్నారు. అందులో కొందరు మాత్రమే నిత్యం జనాల నోళ్ళల్లో నానుతున్నారు. ఎందుకంటే, వారి వ్యవహార శైలే వారికి అటువంటి ఇమేజిని తెచ్చిపెట్టింది. అంతటి ఇమేజి ఉన్న వారిలో టిడిపి తరపున ఓ ఐదుగురుండగా వైసిపి తరపున మరో ముగ్గురున్నారు. 

                                                        టిడిపి 

1-చింతమనేని ప్రభాకర్: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన టిడిపి ఎంఎల్ఏ నిత్యం వార్తల్లోనే ఉంటారు. కాకపోతే తన దుడుకు చేష్టలతో వివాదాస్సదునిగా ప్రచారం అవుతుంటారు. కృష్ణాజిల్లాలో ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేయటంతో రాష్ట్రం మొత్తం మీద చింతమనేని అంటే విపరీతమైన ప్రచారం వచ్చింది. అప్పటికే ఎంఎల్ఏపై పోలీసు స్టేషన్లో కేసులున్నా బయట ప్రపంచానికి తెలిసింది మాత్రం వనజాక్షి గొడవ తర్వాతే. తర్వాత కూడా చాలాసార్లు చాలామందితో గొడవలు పడుతూనే ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల సంతర్భంగా తన ఊరి నుండి గేదెలను, గొఱ్ఱెలను  అసెంబ్లీ ప్రాంతానికి తీసుకొచ్చి వెలగపూడిని మరోమారు వార్తల్లో నిలపటం అందరికీ తెలిసిందే 

2- జెసి సోదరులు: జెసి సోదరులంటేనే వివాదాలకు మారుపేరన్న విషయం అందరికీ తెలిసిందే. సోదరులు ఎక్కడుంటే అక్కడ వివాదాలుంటాయి. తమ వ్యవహారశైలితో నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తిగా సోదరులు బాగా పాపులర్. నిజాలే మాట్లాడుతామంటూ వీరిచ్చే స్టేట్మెంట్ల వల్ల  చంద్రబాబునాయుడు బుకైపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక, ఎయిర్ పోర్టుల సిబ్బందితో గొడవలు, సొంత పార్టీ నేతలతో వివాదాలకు లెక్కే లేదు. వీరిని నియంత్రించటం సాధ్యంకాక చివరకు చంద్రబాబు కూడా పట్టించుకోవటం మానేసారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

3-గొట్టిపాటి-కరణం: మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం మాత్రం టిడిపిలో ప్రత్యేకమే. ఎందుకంటే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గున మండేంత స్ధాయిలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. గొట్టిపాటి వైసిపిలో ఉన్నంత వరకూ వీరిద్దరి మధ్య గొడవల్లో మిగిలిన వారికి క్లారిటీ ఉండేది. విచిత్రమేమిటంటే ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా అదే ఫ్యాక్షన్ కంటిన్యూ అవుతోంది. ఎప్పుడైతే గొట్టిపాటిని చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్నారో అప్పటి నుండే జిల్లా పార్టీలో ముసలం పుట్టింది.

                                                         వైసిపి

4-రోజా: చిత్తూరు జిల్లా నగిరికి చెందిన రోజా సినీనటిగా ఎంత పాపులరో రాజకీయాల్లో కూడా అంతే పాపులారిటీని  సంపాదించుకున్నారు. చంద్రబాబు, లోకేషే అని కాకుండా టిడిపిలో ఎవ్వరిపైనైనా సరే ఒంటికాలిపై లేచేస్తారు. మామూలుగా సినీరంగం నుండి వచ్చిన వారు ఈ స్దాయిలో రాజకీయాల్లో పాతుకుపోవటం అరుదు. విషయం పరిజ్ఞానం, సమస్యలపైనే కాకుండా సమయానుకూలంగా ప్రత్యర్ధులపై స్పందించటంలో రోజా చాలా స్పీడు. అయితే, అదే స్పీడుతో ప్రత్యర్ధులపై చేసే ఆరోపణల్లో పరిమితులను దాటిపోయిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. అసెంబ్లీ నుండి ఏడాది పాటు సస్పెండ్ అవ్వటం, మహిళా సదస్సు సందర్భంగా అరెస్టవటం అందరికీ తెలిసిందే.

5-ఆళ్ళ రామకృష్ణారెడ్డి: గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎంఎల్ఏ నిత్యం వార్తల్లో వ్యక్తిగానే ఉంటున్నారు. ఈయన పోరాటం విలక్షణంగా ఉంటుంది. న్యాయ పోరాట యోధుడు.  అదేంటంటే, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని అనేక ప్రాజక్టుల లోగుట్టు బయటపెట్టేందుకు  న్యాయపోరాటమే చేస్తున్నారు. ఇప్పటి వరకూ చంద్రబాబు, ప్రభుత్వం పైన కలిపి వివిధ అంశాలపై సుమారు 35 కేసులేసుంటారు. అందులో రాజధాని భూముల సేకరణకు వ్యతిరేకంగా వేసిన కేసులే కాకుండా ఓటుకునోటు కేసులో చంద్రబాబును విచారించాల్సిందే అంటూ వేసిన కేసులు కూడా ఉన్నాయి. సదావర్తి భూములపై ఆళ్ళ వేసిన కేసు వల్లే ప్రభుత్వ కుట్ర బయటపడింది.

6-కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి: నిత్యం జనాల్లోనే ఉండటం వల్ల బాగా పాపులరయ్యారు ఈ నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ. సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటారు. సమస్యలు, పరిష్కారం కోసం వినూత్నంగా 91 రోజులుగా ‘మన ఎంఎల్ఏ-మన ఇంటికి’ అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో తిరుగుతున్నారు.

శ్రీధర్ రాష్ట్రంలోనే ఒక విశిష్టమయిన నియోజకవర్గం  ప్రతినిధి. నెల్లూరు రూరల్ లో ఉండేవన్నీ బస్తీలే. వలస కూలీలు. పేదవాళ్లు. చాలా చోట్లకు గవర్నెన్స్ చొరడలేదు. అందుకే ఈ బస్తీలకు వసతుల సమాకూర్చేందుకు ఒక సోషల్ జస్టిస్ ఉద్యమంగా ఆయన 105 రోజుల ‘మన ఎమ్మెల్యే మన ఇంటికి’ చేపట్టారు.  ఇంటిముఖం చూడకుండా, బస్తీలలో తిరుగుతూ, ప్రజల మధ్య నివసించి, వారి సమస్యలను తెలుసుకుని 2019కి ఒక ప్రత్యేక మయిన మ్యానిఫెస్టో విడుదల చేయాలని ఆయన చూస్తున్నారు. దీనితో ఆయన పాదయాత్ర రాష్ట్రంలో సంచలనం అయింది. అసెంబ్లీ సమావేశాలలో తప్ప మిగతా కాలమంతా ప్రతి రోజూ ఏదో ఒక కాలనీలో తారసపడే ఎమ్మెల్యేగా ఆయన పేరొచ్చింది.

 

 

loader