విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తాను గతంలో చదువుకున్న కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. వివరాల్లోకి వెళితే...మల్కాపురం జనతాకాలనీకి చెందిన సింగుపల్లి జోత్స్న నగరంలోని ఓ వుమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.

ఎప్పటిలాగే సోమవారం ఉదయం 7.30 గంటలకు ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరి వెళ్లింది. ఈ క్రమంలో జోత్స్న శాంతిపురంలోని ఓ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందంటూ సాయంత్రం 4 గంటల సమయంలో నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌ సిబ్బంది ఆమె తల్లికి సమాచారం అందించారు.

దీంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఆ వెంటనే శాంతిపురంలోని కట్టా ఎన్‌క్లేవ్‌లో పోలీసులు చెప్పిన ఇంటికి చేరుకున్నారు. అది తన కుమార్తె ఇంటర్ చదువుతున్న సమయంలో లెక్చరర్‌గా పనిచేసిన అంకూర్ ఇళ్లుగా మృతురాలి తండ్రి గుర్తించారు.

పోలీసులు జోత్స్న మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలిస్తుండగా... ఆమె తండ్రి అభ్యంతరం తెలిపారు. అంకూర్ ఇంట్లో తన బిడ్డ ఎలా చనిపోయిందో తేల్చాలని డిమాండ్ చేశారు.

ఆయన చెబుతున్న దాని ప్రకారం అంకూర్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే అంకూర్ ఇంట్లో పరిస్థితులు కూడా జోత్స్న తండ్రి వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

జోత్స్న ఉరి వేసుకుందని అంకూర్ చెబుతుండటం, పోలీసులు రాకముందే మృతదేహాన్ని కిందకు దించడం, ఉరి వేసుకున్నట్లు చెబుతున్న ఫ్యాన్ హుక్కు చాలా ఎత్తులో ఉండటం, గదిలోని సామాగ్రి చెల్లాచెదురుగా పడివుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో అంకూర్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలానికి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించారు.