ఖాతాదారుల బంగారం మాయంచేసి ఓ బ్యాంక్ ఉద్యోగి పరారైన ఘటన పల్నాడు జిల్లాలోని ఓ గ్రామీణ బ్యాంక్ లో వెలుగుచూసింది.
సత్తెనపల్లి : బ్యాంకుల పేరిట కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడున్న అనేక ఘటనలు ఇటీవలకాలంలో వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి మోసగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకోవద్దని జాగ్రత్తలు చెప్పే ఓ బ్యాంక్ ఉద్యోగే ఘరానా మోసానికి పాల్పడ్డాడు. వినియోగదారులు తాకట్టుపెట్టిన బంగారంతో సదరు ఉద్యోగి మాయమైన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
క్రోసూరు మండలం దొడ్లేరులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో వినియోగదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయమయ్యింది. ఖాతాదారులు రుణాలు పొందేందుకు తాకట్టుపెట్టిన దాదాపు రెండు కోట్ల విలువైన బంగారం కనిపించకపోవడంతో కలకలం రేపుతోంది. వెంటనే బ్యాంక్ ఉన్నతాధికారులు బంగారం ఏమయ్యిందోనని ఆరా తీయగా గోల్డ్ అప్రైజర్ నాగార్జున పరారీలో వున్నట్లు గుర్తించారు. అతడే ఈ బంగారంతో పరారయినట్లు బ్యాంక్ అధికారులు అనుమానిస్తున్నారు.
వీడియో
బ్యాంక్ లో బంగారం మాయమైన విషయం బయటపడటంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. బ్యాంక్ వద్దకు చేరుకుని తమ బంగారం ఏమయ్యిందని బ్యాంక్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక అవసరాల కోసం బంగారం తాకట్టుపెట్టి డబ్బులు తీసుకున్నామని... ఇలా తాము నమ్మకంతో బ్యాంకులో పెట్టిన బంగారం మాయమవడం ఏమిటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ బంగారాన్ని రికవరీ చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు.
