సారాంశం

ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి బస్సు హైవేపై బోల్తాపడి 19 మంది గాయపడిన దుర్థటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. 

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళుతున్న ఆర్టిసి బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో బస్సు డ్రైవర్, కండక్టర్ తో పాటు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. 

మంగళవారం ఉదయం శ్రీకాకుళం నుండి పాతపట్నంకు ఆర్టిసి బస్సు బయలుదేరింది. మార్గమధ్యలో ప్రయాణికులను ఎక్కించుకుంటూ ముందుకు వెళుతున్న బస్సు నరసన్నపేట సమీపానికి వెళ్లగానే అదుపుతప్పింది. జాతీయ రహదారిపై వేగంగా వెళుతుండగా బస్సు స్టీరింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ఆగకుండా అదుపుతప్పిన బస్సు రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. కోమర్తి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఆర్టిసి సిబ్బంది సహా 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసారు. గాయాలపాలైన క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Read More  అనకాపల్లిలో మద్యం లోడ్ వ్యాన్ బోల్తా... రోడ్డునపడ్డ బీర్ల కోసం ఎగబడ్డ ప్రజలు

బస్ యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసారు.