దేవాలయాలపై దాడుల్లో 13 మంది టీడీపీ, ఇద్దరు బీజేపీ నేతల అరెస్ట్: డీజీపీ గౌతం సవాంగ్
రాష్ట్రంలోని దేవాలయాలపై జరిగిన దాడుల కేసుల్లో 17 మంది టీడీపీ, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.
అమరావతి: రాష్ట్రంలోని దేవాలయాలపై జరిగిన దాడుల కేసుల్లో 17 మంది టీడీపీ, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.
శుక్రవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 13 మంది టీడీపీ, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు. ఆలయాలపై దాడుల్ని రాజకీయం చేయవద్దని ఆయన కోరారు. అంతేకాదు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.
also read:రామతీర్థం ప్రధాన ఆలయంలో ఏమీ జరగలేదు: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్
రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన తేల్చి చెప్పారు. ఆలయాలపై దాడుల ఘటనల్లో రాజకీయ నేతల ప్రమేయం ఉందని తాము గతంలో చెప్పిన విషయం విచారణలో తేలిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేవారిపై కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలతో భద్రత పెంచుతున్నామని ఆయన తెలిపారు.ఆలయాల భద్రతలో మ్యాపింగ్, సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు. పోలీస్ భద్రతతో పాటు టెంపుల్ కమిటీలు, మత సామరస్య కమిటీలు సమన్వయం చేస్తాయని ఆయన డీజీపీ చెప్పారు.