బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంకు చెందిన పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌ను పెట్రోల్ పోసి నిప్పు అంటించి సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంకు చెందిన పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌ను పెట్రోల్ పోసి నిప్పు అంటించి సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తన సోదరిపై వేధింపులను ప్రశ్నించినందుకు బాలుడిని దారుణంగా హతమార్చారు. ఈరోజు ఉప్పలవారిపాలెంలో అమర్నాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. హత్యకు గురైన బాలుడి కుటుంబ సభ్యులను పలువురు టీడీపీ నేతలు పరామర్శిస్తున్నారు. బాలుడిని హత్య చేసిన వారికి వైసీపీ నేతల అండ ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమర్నాధ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ భరోసా ఇచ్చారు. చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
చెరుకుపల్లి వద్ద అమర్నాథ్ మృతదేహాంతో వెళ్తున్న అంబులెన్స్‌ను బీసీ సంఘాలు, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, పలువురు టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అమర్నాథ్ హత్యకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించాలని, మృతుని సోదరికి ఉద్యోగం ఇవ్వాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే వీరి ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి.
వైసీపీ ఎంపీకి నిరసన సెగ..
దారుణ హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామంలోకి రావద్దని బాలుడి బంధువులు ఎంపీ మోపిదేవిని అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాను వ్యక్తిగతంగా బాలుడి కుటుంబానికి రూ. లక్ష పరిహారం అందించేందుకు వచ్చానని ఎంపీ మోపిదేవి చెప్పగా.. తామే రూ. లక్ష ఇస్తామని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిరసనకారులు బుదులిచ్చారు. దీంతో ఎంపీ మోపిదేవి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ క్రమంలోనే చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
