విశాఖలో కరోనా కలకలం: ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో 102 మందికి పాజిటివ్

విశాఖపట్నంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీలో 102 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నారు.

102 infected with Coronavirus at Andhra University engineering college

విశాఖపట్నం: విశాఖపట్నంలో మళ్లీ కరోనా కలకలం రేగుతోంది. నగర శివారు ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తోంది. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల క్యాంపస్‌లో 102 మందికి వైరస్ సోకింది. రోజూ 7 వేలకు తగ్గకుండా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్న వైద్య శాఖ..కేజీహెచ్‌, విమ్స్‌ ఆస్పత్రుల్లో పదకొండ వందల యాభై బెడ్లను సిద్ధంగా ఉంచింది.

విశాఖపట్నంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. పెందుర్తి, ఆరిలోవ, భీమునిపట్నం, ఆనందపురం శివారు ప్రాంతాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఏయూ విద్యార్థుల్లో 102 మందికి కరోనా సోకింది.

ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల క్యాంపస్‌లో ఇప్పటి వరకు 96 మంది అబ్బాయిలకు, ఒక అమ్మాయికి, ఐదుగురు ఫ్యాకల్టీకి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉంచి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. మరో 200 మందిని క్వారంటైన్‌లో ఉంచారు.

విశాఖ జిల్లా వ్యాప్తంగా ఒక వైపు టీకా ప్రక్రియను వేగవంతం చేస్తూనే మరోవైపు నిత్యం 7వేలకు తగ్గకుండా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయడంతోపాటు, శానిటైజేషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు.

వైరస్ కేసులు పెరగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కేజీహెచ్‌లో 550, విమ్స్‌లో 600 పడకలు అందుబాటులో ఉంచింది. కరోనా నిబంధనలు అందరూ పాటించాలని, అత్యవసర పనులకే ఇంటి నుంచి బయటకు రావాలని వైద్యులు కోరుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios