కొత్త ఇండియన్ మ్యాప్ నుంచి అమరావతి మాయం: ఏపీ రాజధానిపై క్లియర్
భారత చిత్రపటం నుంచి అమరావతి మాయమైంది. అన్ని రాష్ట్రాల రాజధానులు అందులో చోటు చేసుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్చలేదు. దీంతో అమరావతిలో ఏపీ రాజధాని కొనసాగుతుందా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం విడుదల చేసిన కొత్త భారత చిత్రపటం నుంచి అమరావతి మాయమైంది. దీంతో అధికార వైఎస్సార్ కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య వివాదం రాజుకుంటోంది. కొత్త ఇండియన్ మ్యాప్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసింది. అందులో కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లడక్ లను చేర్చారు.
అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లను కూడా చిత్రపటంలో చేర్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని మాత్రం కనిపించడం లేదు. అమరావతిని అందులో చేర్చలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు పేరు చేర్చారు. దాన్ని బట్టి ఏపీ రాజధానిగా అమరావతి ఉండబోదనే స్పష్టత వచ్చినట్లు భావిస్తున్నారు
ఇండియన్ మ్యాప్ లో అమరావతి లేకపోవడాన్ని బట్టి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధానిని మరో ప్రాంతానికి తరలిస్తున్నారనేది అర్థమవుతోందని టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య హిందుస్తాన్ టైమ్స్ తో అన్నారు. రాజధాని తరలింపుపై కేంద్రానికి తన అభిప్రాయాన్ని జగన్ కు చెప్పి ఉంటారని ఆయన అన్నారు. సవరించిన భారత చిత్రపటంలో అమరావతి లేకపోవడానికి కారణమదే అయి ఉంటుందని ఆయన అన్నారు.
రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారని, గత ఐదేళ్లుగా అధికారిక కార్యలాపాలన్నీ అమరావతి నుంచే నడుస్తున్నాయని, కేంద్రానికీ రాష్ట్రానికీ మధ్య సమాచార వినిమయం కూడా అక్కడి నుంచే జరుగుతోందని ఆయన చెప్పారు.
రాజధాని పేరు లేకుండా ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో చోటు చేసుకోవడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. దానికి చంద్రబాబు నాయకత్వంలోని గత టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు. అమరావతిలో శాశ్వత నిర్మాణాలను కాకుండా తాత్కాలిక నిర్మాణాలను చేపట్టారని, అమరావతిని రాజధానిగా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.