Oct 10, 2022, 1:06 PM IST
కామారెడ్డి : కన్న కొడుకును కోల్పోయిన మహిళ కన్నీరు పెట్టుకుంటూ న్యాయం జరిగేలా చూడాలంటూ కాళ్లపై పడి వేడుకోవడం చూసి వైస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. బాధిత మహిళను ఓదార్చిన షర్మిల వైఎస్సార్ టిపి తరపున అండగా వుంటామని భరోసా ఇచ్చారు. ఒక్కగానొక్క కొడుకు హత్యకు గురయి ఏడాది గడుస్తున్నా నిందితులను పట్టుకుని శిక్షించలేదంటే ఈ ప్రభుత్వం ఎందుకు? ఈ యంత్రాంగం ఎందుకు? అంటూ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లింగంపేట్ మండలం ముస్తాపూర్ లో నిర్వహించిన మాట-ముచ్చట కార్యక్రమంలో ఓ మహిళ తన గోడును షర్మిలకు తెలిపింది. తన కొడుకు హత్య జరిగి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు న్యాయం జరగలేదంటూ ఆ తల్లి కన్నీటిపర్యంతం అయ్యింది. దీంతో ఈ ప్రభుత్వం మారితేనే మన బతుకులు మారతాయని... ఓట్లు వేయించుకుని ప్రజల గురించి పట్టించుకోని నాయకులకు తగిన బుద్ది చెప్పాలని షర్మిల సూచించారు.