భారతీయ విద్యార్థులను బూటుకాలితో తంతూ... బార్డర్ వద్ద ఉక్రెయిన్ సైన్యం పైశాచికం: జగిత్యాల యువతి

Mar 4, 2022, 1:33 PM IST

జగిత్యాల: రష్యా దాడులతో ఉక్రెయిన్ లో భయానక వాతావరణం నెలకొంది. బాంబుల వర్షం, తుపాకుల మోతతో ఉక్రెయిన్ అట్టుడుకి పోతున్నా ఆ దేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగులను భారత్ సురక్షితంగా స్వదేశానికి తీసుకువస్తోంది. ఆపరేషన్ గంగ పేరుతో భారత విద్యార్థులను స్వదేశానికి తరలించే కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇలా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన పెడిమల్ల ఉషశ్రీ ఉక్రెయిన్ నుండి క్షేమంగా ఇంటికి చేరుకుంది. అయితే ఉక్రెయిన్ నుండి ఎలా బయటపడింది వివరిస్తూ అక్కడ సైన్యం తమపట్ల చాలా దారుణంగా వ్యవహరించిందని ఉషశ్రీ తెలిపారు. ఎలాగోలా రొమెనియా బార్డర్ వద్దకు చేరుకున్న తమను ఉక్రెయిన్ సైన్యం బూటుకాలితో తంతూ హింసించిందని... ఇది చూసి భయపడిపోయిన తాను వెక్కివెక్కి ఏడుస్తూ స్పృహ కోల్పోయానని తెలిపింది. అయితే కళ్ళుతెరిచి చూస్తే అంబులెన్స్ లో వున్నానని... ఈ క్రమంలో లగేజి మిస్సయ్యిందని తెలిపారు. ఎన్నోకష్టాలకు ఓర్చి ఇలా స్వదేశానికి చేరుకున్నానని ఉషశ్రీ ఉక్రెయిన్ నుండి ఇండియావరకు తన అనుభవాలను వెల్లడించారు.