జమిలి ఎన్నికలే జరిగితే..: తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం!

First Published | Dec 12, 2024, 7:26 PM IST

జమిలి ఎన్నికల (ఒకే దేశం ఒకే ఎన్నిక) దిశగా మోదీ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈ ఎన్నికల ప్రభావం తెలుగు రాాష్ట్రాలపై ఎలా వుంటుందో తెలుసుకుందాం.  

One Nation One Election

One Nation One Election : భారతదేశంలో  ఎన్నికల సంస్కరణలకు సిద్దమయ్యింది మోదీ సర్కార్. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి వన్ నేషన్ వన్ ఎలక్షన్ (జమిలి) పై ఆసక్తితో వుంది... ఇప్పుడు కాదు గతంలో వాజ్ పేయి హయాంలోనే ఈ దిశగా ఆలోచన  చేసారు. కానీ అప్పుడు ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. కానీ ప్రస్తుతం జమిలి ఎన్నికలపై చాలా సీరియస్ గా ముందుకు వెళుతోంది కేంద్ర ప్రభుత్వం.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఏర్పాటుచేసిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. దేశ ప్రజలే కాదు అనేక పార్టీలు కూడా జమిలి ఎన్నికలకు మద్దతు ఇస్తున్నట్లు ఈ కమిటీ చెబుతోంది. ఈ క్రమంలోనే వచ్చే లోక్ సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకువచ్చేందుకు సిద్దమయ్యింది కేంద్రం.

ఇవాళ(గురువారం) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమయ్యింది. ఇందులో ప్రధానంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై చర్చించారు. అనంతరం ఈ జమిలి ఎన్నికల బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఇక  ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు వెళ్ళనుంది... ఉభయ సభల ఆమోదం లభిస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. 
 

One Nation One Election

తెలుగు రాష్ట్రాలపై జమిలి ఎన్నికల ప్రభావం : 

వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమేనని అధికార ఎన్డిఏ, అసాధ్యమని ప్రతిపక్ష ఇండియా కూటమి అభిప్రాయం. ఎవరి వాదన ఎలా వున్నా ప్రభుత్వం ఈ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ చేస్తోంది... వడివడిగా ముందుకు వెళుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 2029 లో లోక్ సభతో పాటే అన్నిరాష్ట్రాలకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. 

ఇదే జరిగితే కొన్ని రాష్ట్రాల్లోని అధికార పార్టీలు లాభపడగా మరికొన్ని రాష్ట్రాల్లోని అధికార పార్టీలు నష్టపోతాయి. ఇక ఇటీవల లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఎలాంటి ప్రభావం వుండదు. అంటే ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార కూటమికి (టిడిపి, జనసేన,బిజెపి) జమిలి ఎన్నికల నిర్వహణవల్ల లాభంగాని, నష్టంగాని లేదు. అలాగే ఒడిషా,అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లోనూ జమిలి ఎన్నికల ప్రభావం వుండదు.

తెలంగాణ విషయానికి వస్తే ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ముందే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంటే 2028 లో ఇక్కడ మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. కానీ 2029 లో జమిలి ఎన్నికలు జరిగితే పదవీకాలం ముగిసినా కొంతకాలం ప్రభుత్వం కొనసాగుతుంది. ఇలా ఐదారునెలలు అదనంగా పాలించే అవకాశం రేవంత్ ప్రభుత్వానికి దక్కుతుంది. అంటే జమిలి ఎన్నికల వల్ల తెలంగాణ కాంగ్రెస్ కు లాభమే జరుగుతుంది. 

ఇలా దేశవ్యాప్తంగా ఒకేసారీ ఎన్నికలు జరిగితే కొన్ని పార్టీలు ప్రత్యక్షంగా లాభపడగా, మరికొన్ని నష్టపోతాయి. పదవీ కాలం ముగియకుండానే అధికారాన్ని కోల్పోయేవి కొన్నయితే...పదవీకాలం ముగిసాక కూడా అధికారంలో వుండేవి మరికొన్ని. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తెలంగాణతో పాటు మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్  వంటి రాష్ట్రాల్లో అధికార పార్టీలు లాభపడే అవకాశం వుంది. అలాగే లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్నికలు జరిగిన  రాష్ట్రాలు పదవీకాలం ముగియకుండానే అధికారం కోల్పోయే అవకాశం వుంది. 
  

Tap to resize

One Nation One Election

వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమేనా? 

వన్ నేషన్ వన్ ఎలక్షన్ (ఒకే దేశం ఒకే ఎన్నిక)... దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే మాటిమాటికి ఎలక్షన్ కోడ్ పేరిట అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం వుండదని మెజారిటీ ప్రజల అభిప్రాయం. అందువల్లే ఈ ఎన్నికలకు ప్రజల మద్దతు లభిస్తోంది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం 80 శాతం మంది జమిలి ఎన్నికలవైపే మొగ్గుచూపారు. అనేక రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా ఇదే. 

అయితే జమిలి ఎన్నికల కాన్సెప్ట్ బాగానే వున్నా ఇది ఆచరణ సాధ్యమా అన్న అనుమానాలు ప్రజల్లో వున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది అసాధ్యం అంటున్నాయి. దీంతో పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కేవలం లోక్ సభ ఎన్నికలనే ఒకేసారి నిర్వహించడం సాధ్యం కావడంలేదు... పలు విడతల్లో నిర్వహిస్తున్నారు... అలాంటిది లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పనేనా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
అంతేకాదు జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ అవసరమని రామ్ నాథ్ కోవింద్ కమిటీ స్పష్టం చేసింది. అయితే ఇందుకోసం పార్లమెంట్ లో టూ థర్డ్ మెజారిటీ వుండాలి. ఆ బలం ఎన్డిఏకు వుందా? అంటే లేదు అనేదే సమాధానం. ఎన్డిఏ కూటమికి లోక్ సభలో 292, రాజ్యసభలో 112 మంది సభ్యుల బలం వుంది. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటే లోక్ సభలోని 545 సీట్లకు గాను 364 సీట్లు వుండాలి. కానీ ఎన్డిఏకే అటు లోక్ సభ, ఇటు రాజ్యసభలో అంత బలం లేదు. 

ఎలాగోలా పార్లమెంట్ లో గట్టెక్కినా న్యాయ పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం వుంది. జమిలి ఎన్నికల వల్ల ముందుగానే అధికారాన్ని కోల్పోయే ప్రతిపక్ష పార్టీలు కోర్టులను ఆశ్రయిస్తాయి. అప్పుడు కోర్టు తీర్పును బట్టి నడుచుకోవాల్సి వుంటుంది. ఇలా జమిలి ఎన్నికలపై అనేక అనుమానాలున్నాయి... కానీ మోదీ సర్కార్ మాత్రం అన్ని అడ్డంగులు దాటుకుని దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించి చూపిస్తామని అంటోంది. 

Latest Videos

click me!