టీఎస్ పిఎస్సీ పరీక్షకు నో పర్మిషన్... కరీంనగర్ లో అభ్యర్థుల ఆందోళన

Jan 3, 2023, 5:03 PM IST

కరీంనగర్ : తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్ పిఎస్సి) మంగళవారం రాత పరీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాయడానికి వెళ్లిన తమకు అధికారులు అన్యాయం చేసారంటూ కొందరు ఉద్యోగార్థుల ఆందోళనకు దిగారు. పరీక్ష సమయం ఉదయం 10.00 గంటల నుంచి 12.30 గంటల వరకు ఉండగా అభ్యర్థులకు ఉదయం 8.30 నుంచి 9.15 వరకు మాత్రమే పరిక్షా సెంటర్లోకి అనుమతించారు అధికారులు. అయితే నిర్ణీత సమయంలోపే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నా ముందుగానే గేట్ క్లోజ్ చేసిన అధికారులు అన్యాయంగా వ్యవహరించారని 30 మంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పరీక్ష రాయకుండా చేసి తమ జీవితాలతో అధికారులు చెలగాటం ఆడారంటూ వాగేశ్వరి కాలేజి ఎదుట బైఠాయించి అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనకు దిగిన అభ్యర్థులకు నచ్చజెప్పి అక్కడినుండి పంపించారు.