కుల దురహంకారంతో ప్రిన్సిపాల్ అమానుషం... వికారాబాద్ లో విద్యార్థుల ఆందోళన

Jan 4, 2023, 12:49 PM IST

వికారాబాద్ : విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు కులంపేర విద్యార్థులతో దారుణంగా వ్యవహరించిన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. అగ్రకుల దురహంకారంతో  చిన్నారుల మనసులు గాయపరుస్తున్న ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు రోడ్డెక్కారు. ఇలా పెద్దెముల్ మండలం గొట్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గాయత్రి తీరు వివాదాస్పదంగా మారింది.  

ప్రిన్సిపాల్ గా బాధ్యతాయుతమైన స్థానంలో వున్న గాయత్రి విద్యార్థులందరిని సమానంగా చూడకుండా కులవివక్ష ప్రదర్శిస్తోందని ఆరోపణలున్నాయి. ఇటీవల ఆమె వ్యవహారం మరింత ముదిరి కులం పేరుతో విద్యార్థులను దూషిస్తోందట. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు తెలపడంతో వారు విద్యార్థి సంఘాల నాయకులకు విషయం తెలిపారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. విద్యార్థులపై కులవివక్ష ప్రదర్శిస్తూ వేధిస్తున్న గాయత్రికి ప్రిన్సిపాల్ గా కొనసాగే హక్కు లేదని... ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యాశాఖను విద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్ చేసారు.