నేడు అమ్మమ్మ వాళ్ల ఊరికి కేటీఆర్ ... రాత్రి నుండే ముందస్తు అరెస్టులు

Jan 10, 2023, 10:20 AM IST

సిరిసిల్ల :  తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. బోయినపల్లి మండలంలోని అమ్మమ్మ వాళ్ల ఊరు కొదురుపాకలో మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే మంత్రి పర్యటన సమయంలో నిరసన తెలిపేందుకు సిద్దమైన మిడ్ మానేరు ఐక్యవేదిక కన్వీనర్ తో పాటు పలువురు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసారు.  

ఈ సందర్భంగా అరెస్టయిన నాయకులు మాట్లాడుతూ... కొద్దిరోజుల క్రితం కేటీఆర్ మిడ్ మానేరు నిర్వాసితుల గురించి చేసిన వ్యాఖ్యలు నాయకులు గుర్తుచేసారు. తన అమ్మమ్మ ఊరు కొదురుపాక మిడ్ మానేరులో మునిగిపోయింది... నాన్న గ్రామం ఎగువ మానేరులో మునిగిపోయింది... కాబట్టి నిర్వాసితుల బాధలు మాకంటే ఎక్కువ ఎవరికి తెలుసని కేటీఆర్ అన్నారని గుర్తుచేసారు. అయినా ఇప్పటివరకు మిడ్ మానేరు నిర్వాసితులకు సీఎం కేసీఆర్ హామీలు ఇంకా నెరవేరలేదన్నారు. దీని గురించే కేటీఆర్ ను కలిసి వినతిపత్రం ఇస్తామంటే ముందస్తు అరెస్టులు చేసారని మిడ్ మానేరు ఐక్యవేదిక నాయకులు  తెలిపారు.