ముఖ్యమంత్రి ఇలాకాలో తలసాని... కేసీఆర్ విజనరీ అంటూ పొగడ్తలు

Sep 13, 2023, 5:09 PM IST


సిద్దిపేట : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పర్యటించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ లో చేపలు, రొయ్య పిల్లలను మంత్రి వదిలారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు, బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మత్స్యరంగం అభివృద్ది చెందిందని అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని... ఇదే విజన్ తో సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వమే జలాశయాల్లో ఉచితంగా చేప, రొయ్య పిల్లలను విడిచిపెడుతోందని... దీంతో మత్స్యసంపద గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వ సహకారంతో మత్స్యకారులు జీవితాలు ఆనందమయం అయ్యాయని మంత్రి తలసాని పేర్కొన్నారు.