Jan 3, 2023, 3:35 PM IST
భువనగిరి : మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ సేవలను వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కిడ్నీలు పనిచేయక రక్త శుద్ది జరక్క ఇబ్బందిపడేవారికి ఈ డయాలసిస్ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నారు. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ సేవలను ఇప్పటికే రాష్ట్రంలోని పలు హాస్పిటల్లో ప్రారంభించిన కేసీఆర్ సర్కార్ తాజాగా మునుగోడు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇలా మునుగోడులో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరీష్ తో పాటు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... ఇటీవల మునుగోడు ఉపఎన్నికలో విజయం తర్వాత ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డయాలసిస్ సెంటర్ కోసం విజ్ఞప్తి చేసారన్నారు. దీంతో వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రిలో 5 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసామని అన్నారు. డయాలసిస్ కేంద్రాల పనితీరులో దేశానికే తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకం అయ్యిందని... తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తమ రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఇలాంటి ఏర్పాట్లే చేసారని హరీష్ రావు అన్నారు.