Jan 2, 2023, 5:01 PM IST
గుంటూరు : టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట, కానుకల కోసమని ఆశతో వచ్చిన సామాన్య మహిళల మృతి విచారకరమని వైసిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. నిర్వహణ లోపంవల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందని... టిడిపి నిర్లక్ష్యమే మహిళల మృతికి కారణమని ఆరోపించారు. నిరుపేదలకు బహుమతుల ఆశ చూపిన తెలుగుదేశం పార్టీ వారి జీవితాలతో ఆటలాడుకుందని అన్నారు. కొత్త సంవత్సరం రోజున నరబలి తీసుకుని పేదల ఉసురు పోసుకున్నారని అన్నారు. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు జరగకుండా టిడిపి పై కఠినమైన కేసులు నమోదు చేయాలని డిక్కా డిమాండ్ చేసారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్సీ డొక్కా దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్సీకి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు అర్చకులు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వుండేలా చూడాలని దేవున్ని వేడుకున్నట్లు డొక్కా తెలిపారు.