Galam Venkata Rao | Published: Feb 8, 2025, 6:01 PM IST
అవినీతికి ఘనాపాటిగా మారిన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, అక్రమ కేసులతో తనను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. చిలకలూరిపేటలోని తన నివాసంలో రజిని మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులకు తాను భయపడపోనని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని, ఆయన ఆదేశాలతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తన కుటుంబంపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. నిజానికి హైకోర్టు ఆదేశించకపోయినా, తన కుటుంబంపై అక్రమంగా కేసు నమోదు చేశారని చెప్పారు. కేవలం తన కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పని చేస్తున్నారని, ఆయన ఆదేశాలతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులకు కచ్చితంగా ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు.